Jordan parliament fight: జోర్డాన్ పార్లమెంట్లో సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివాదాస్పద దేశ రాజ్యాంగ సవరణ అంశంపై వాదనలు తీవ్రమై.. ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
జోర్డాన్‌లో రాజ్యాంగబద్ధమైన రాచరిక పాలన నడుస్తోంది. అయితే, రాజుకు ఉన్న అధికారాలపై ప్రజాస్వామ్య సంస్థలు ఎలాంటి పరిమితి విధించడం లేదని పలువురు ఎంపీలు వాదిస్తున్నారు. ప్రధాని ఎంపిక సహా పార్లమెంట్‌ను నచ్చిన సమయంలో రద్దు చేసే అధికారాలనూ ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రిని ఎంపిక చేసే అధికారం ఎంపీలకు కట్టబెట్టే రాయల్ కమిషన్‌ను సవరణలో పొందుపర్చారు. అయితే, ఇందులో ప్రతిపాదించిన ఇతర సవరణలు రాజు అధికారాలను మరింత పెంచేలా ఉన్నాయని ప్రజాస్వామ్య అనుకూలవాదులు వాదిస్తున్నారు.
Jordan king Abdullah
జోర్డాన్‌ను కింగ్ అబ్దుల్లా 1999 నుంచి పాలిస్తున్నారు. పాశ్చాత్త దేశాలకు సన్నిహితుడైన ఆయన.. దేశంలో పెరుగుతున్న అసమ్మతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సైతం ముందుకు కదలడం లేదు. 'పాక్షిక స్వేచ్ఛాయుత' దేశంగా ఉన్న జోర్డాన్.. తాజాగా 'స్వేచ్ఛ లేని' దేశాల జాబితాలోకి పడిపోయింది.
ఇదీ చదవండి: బంగారం గనిలో ప్రమాదం- 38 మంది మృతి