రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ఇజ్రాయెల్‌కు మరో షాక్ తగిలింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై అవినీతి ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించారు అటార్నీ జనరల్ అవిచై మండెల్బ్లిట్. అవినీతి, మోసం, అవిశ్వాసం వంటి అభియోగాలతో ప్రధానిపై కేసు నమోదు చేస్తానని స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలు నిరూపితమైతే ఎన్నో దశాబ్దాల నెతన్యాహూ రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ఇజ్రాయెల్ న్యాయశాఖ తెలిపింది. పదవిలో ఉండి అభియోగాలు ఎదుర్కొన్న తొలి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే.
సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల ఇజ్రాయెల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వ ఏర్పాటులో అధికార, ప్రధాన విపక్ష పార్టీలు విఫలమయ్యాయి. ఈ తరుణంలో నెతన్యాహూపై అటార్నీ జనరల్ ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
తిరుగుబాటు కోసమే...
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు నెతన్యాహూ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికే న్యాయవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
"దేశం కోసం నా జీవితాన్ని అర్పించా. దేశం కోసం పోరాడాను. ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పుడే నాపై ఈ అభియోగాలు మోపారు. మన న్యాయవ్యవస్థలో ఎదో చెడు జరుగుతోందని అర్థమవుతోంది."
--- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని.
తనపై కేసు నమోదైనా.. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం దోషిగా తేలే వరకు ప్రధాని పదవికి నెతన్యాహూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానిపై అవినీతి ఆరోపణల వల్ల దేశంలో తీవ్ర దుమారం చెలరేగే అవకాశముంది. రాజకీయ ఒత్తిళ్లకు ఆయన తలొగ్గి రాజీనామా చేసే వీలుంది.