ఇజ్రాయెల్లో ప్రభుత్వం కుప్పకూలింది. గడువులోగా బడ్జెట్ ఆమోదించడంలో పార్లమెంట్ విఫలమవ్వడం వల్ల ఏడు నెలలు తిరగకుండానే నెతన్యాహు ప్రభుత్వం పడిపోయింది. వచ్చే ఏడాది మార్చి 23న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే రెండేళ్ల వ్యవధిలో దేశంలో ఎన్నికలు జరుగుతుండటం ఇది నాలుగోసారి.
ఈ ఏడాది ఏప్రిల్లో బెన్నీ గంట్జ్ నేతృత్వంలోని విపక్ష బ్లూ అండ్ వైట్ పార్టీ.. నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ప్రధాని పదవిని పంచుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన తర్వాత గంట్జ్కు పగ్గాలప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ మధ్యలోనే ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ప్రభుత్వం కుప్పకూలిపోయింది.
మాటల యుద్ధం..
'ప్రభుత్వం పడిపోవడానికి మీరే కారణం' అంటూ గంట్జ్, నెతన్యాహు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 'కరోనా సంక్షోభంలో అనవసరమైన ఎన్నికలకు బ్లూ అండ్ వైట్ పార్టీ లాగుతోంద'ని నెతన్యాహు మండిపడ్డారు. తాము ఎన్నికలను కోరుకోవడం లేదని.. అయితే ఎన్నికల గురించి భయపడటం లేదని, తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్లో ఆగని నిరసనలు-ప్రధాని రాజీనామాకు డిమాండ్
మరోవైపు, నెతన్యాహుపై ఉన్న అవినీతి ఆరోపణల లక్ష్యంగా విమర్శలు చేశారు బెన్నీ గంట్జ్. ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా.. అవినీతి కేసుల విచారణపైనే నెతన్యాహు అధిక శ్రద్ధ కనబరుస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసే బదులు మొత్తం దేశాన్ని అనిశ్చితిలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్: పార్లమెంట్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం