ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఇరు పక్షాలూ దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ పట్టుబిగించినట్లు కనపడుతోంది. గురువారం తెల్లవారుజామున గాజాపై సైనిక దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో హమాస్‌కు చెందిన 10మంది సీనియర్ సైనికాధికారులు మృతిచెందారు. ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన రెండు భవనాల కుప్పకూలాయి. దీనిని ప్రతిఘటిస్తూ.. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ సభ్యులు రాకెట్లు ప్రయోగించినట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితికి కారణం అదే..
ప్రస్తుత పరిస్థితులకు ఒక నెల ముందే జెరూసెలంలో బీజం పడింది. ఈ ప్రాంతంలో నివసించే పలు పాలస్తీనియన్లను అక్కడ స్థిరపడ్డ యూదులు ఖాళీ చేయమని బెదిరించారు. యూదులకు పోలీసులు మద్దతు తెలపడం వల్ల ఆగ్రహానికి గురైన పాలస్తీనియన్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూదులు, ముస్లింలు పవిత్రంగా భావించే అల్-అక్సా మసీదు వద్ద ఆందోళనలో భాగంగా నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది.
ఈ ఘటనకు స్పందనగా ఇస్లామిక్ మిలిటెంట్లు అయిన హమాస్ సంస్థ, ఇస్లామిక్ జిహాద్.. ఇజ్రాయెల్‌పై సోమవారం రాకెట్ దాడులు చేశాయి. దీంతో మిలిటెంట్లు ఉన్న గాజాపై ప్రతిచర్యగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఫలితంగా ఆ ప్రాంతంలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి.
వెయ్యికి పైగా రాకెట్లు
2014లో జరిగిన ఘర్షణలను తాజా పరిణామాలు గుర్తుచేస్తున్నాయి. పరిస్థితులు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
హమాస్ మిలిటెంట్లు గత మూడు రోజుల్లో తమపై సుమారు 1000కిపైగా రాకెట్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య 2014 యుద్ధంలో ప్రయోగించిన రాకెట్ల సంఖ్యలో పావు వంతని పేర్కొన్నాయి.
మరోవైపు ఇరు పక్షాల మధ్య జరుగుతున్న దాడులు ఇజ్రాయెల్‌లో ఉద్రిక్తతను నెలకొల్పాయి. యూదులు-అరబ్బుల మధ్య ఘర్షణకు దారితీశాయి.
ఆందోళనకరంగా మృతుల సంఖ్య!
ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 65కి పెరిగింది. వీరిలో 16 మంది పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. తమ మిలిటెంట్లలో ఏడుగురు మృతిచెందినట్లు ఇస్లామిక్ జిహాద్ తెలిపింది. టాప్ కమాండర్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారని హమాస్ పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య ఏడుగా ఉన్నట్లు సమాచారం.
విదేశాల మాట..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రజలకు మద్దతును ప్రకటించారు. తమ పౌరులను రక్షించుకుంటూ దేశ భద్రతకు కృషి చేసేవిధంగా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని బైడెన్ హామీనిచ్చినట్టు శ్వేతసౌధం వెల్లడించింది.
పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్ సంప్రదింపులు జరిపారు. ఉద్రిక్తతలకు తెరదించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇజ్రాయెల్ దాడులను ఖండించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ గాజాకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నోబెల్ శాంతి పురస్కార గ్రహిత మలాలా యూసఫ్జాహి పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు. ఈ పరిస్థితులు సద్దుమణిగేలా ప్రపంచ నేతలు సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.
ఇవీ చూడండి : గాజాపై వైమానిక దాడి- కుప్పకూలిన భవనం