ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారస్థాయికి చేరాయి. తాజాగా విద్యార్థులు కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకుని ఆ దేశ ప్రధాని అబ్దుల్ మహదాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాగ్దాద్‌లోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాలుపంచుకున్నారు.
పోలీసులు గురువారం ఆంక్షలు విధించినప్పటికీ నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను చెదరగోట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో ఒక్కరోజే 60 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. భాష్ప వాయువులను ప్రయోగించటాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు, విద్యార్థులు ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు.
కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇరాక్ చరిత్రలో ఇంతటి స్థాయిలో ప్రభుత్వ నిరసనలు జరగలేదని ఆ దేశ మత గురువులు అభిప్రాయపడ్డారు.