ఐక్యరాజ్య సమితి పరిశీలకులకు.. ఇరాన్ తమ అణు కార్యకలాపాల గురించి తక్కువ సమాచారాన్ని అందుబాటులో ఉంచనుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫేల్ గ్రోసీ తెలిపారు. అయితే ఇప్పటికైతే ఆ కార్యక్రమాలపై పర్యవేక్షించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర పర్యటన కోసం ఇరాన్ వెళ్లిన ఆయన.. అణు కార్యక్రమాలపై ఆ దేశంతో 'సాంకేతిక అవగాహన' కుదుర్చుకున్నట్లు చెప్పారు. మూడు నెలల వరకు ఇరాన్ అణు కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆ దేశం అనుమతించనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిశీలకుల సంఖ్య ఇది వరకు స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. కార్యాచరణలోనే మార్పు ఉంటుందన్నారు.
"ఇప్పటివరకు అస్థిరంగా ఉన్న పరిస్థితులను మార్చాలనే ఐఏఈఏ కోరుకుంటోంది. సాంకేతిక అవగాహన వల్ల ఇది సాధ్యమవుతుంది. దీని వల్ల ఇతర రాజకీయ సంప్రదింపులు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న అస్పష్టమైన పరిస్థితిని నివారించగలగడం ఇంకో ముఖ్యమైన విషయం. ఇప్పుడు కూడా పర్యవేక్షణ సంతృప్తికరంగానే కొనసాగుతుంది."
-రాఫెల్ గ్రోసీ, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్
2015 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యురేనియం నిల్వలను ఇరాన్ పెంచుతోందని ఇటీవలే నివేదికలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై అమెరికా ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. తాజా పరిణామాలు ఇరు దేశాల బంధంపై మరింత ప్రభావం చూపే అవకాశముంది.
అయితే పాశ్చాత్త దేశాలపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రోసీతో భేటీకి ముందు స్థానిక మీడియాతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావద్ జరీఫ్.. అణు స్థావరాల్లోని సీసీ కెమెరాల పుటేజీని యాక్సెస్ చేయకుండా నిరోధించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాలనే అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం అధికారులకు కెమెరా టేపులను ఇవ్వకూడదని చెప్పారు. 'ఇది ప్రపంచ దేశాలకు డెడ్‌లైన్ కాదు. అల్టిమేటం కాదు' అని వివరించారు.
ఇరాన్‌తో ఇదివరకు కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. నిఘా కెమెరాల్లో చిత్రీకరించిన వందలాది ఫొటోలను ఐఏఈఏ పరిశీలిస్తుంది. తాజా చట్టం ప్రకారం కెమెరాలను పూర్తిగా నిషేధిస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు.
ఇదీ చదవండి: