అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్నెయిర్ సైనిక స్థావరంపై దాడికి, ఆ దేశ సైనిక ఉప ప్రధానాధికారి జనరల్ జోసెఫ్ ఎం మార్టిన్‌ను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. 2000లో యెమన్‌లో అమెరికా నౌకాదళానికి చెందిన యూఎన్ఎస్ కోల్‌పై జరిగిన తరహాలో ఆత్మాహుతి దాడిని పునరావృతం చేయాలని ఇరాన్ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్ దళం కుట్ర పన్నుతున్నట్లు ఈ నిఘా సమాచారం సూచిస్తోంది.
అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్, జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ) దీనిపై స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
ప్రతీకారంగానే..
గతేడాది జనవరిలో ఇరాన్‌కు చెందిన సైనిక ఉన్నతాధికారి జనరల్ సులేమానీని అమెరికా హత్య చేసినందుకు ప్రతీకారంగా ఇలాంటి దాడులకు దిగాలని ఇరాన్ తలపోస్తోంది. మార్టిన్‌ను హత్య చేయడమే కాకుండా ఫోర్ట్ మెక్ నెయిర్ స్థావరంలోకి తన సిబ్బందిని అక్రమంగా చొప్పించి, రహస్యంగా సమాచారాన్ని సేకరించాలని కూడా భావిస్తోంది. ఈ సైనిక స్థావరంలోనే మార్టిన్ నివాసం కూడా ఉంది.
ఇదీ చూడండి: ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై దాడి