ఇరాన్లో విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నిలువరించడానికి అక్కడి సైనిక యంత్రాంగం ముమ్మర చర్యలకు సిద్ధమైంది. వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా వీధుల్లో జనసమూహాలను నివారించనున్నట్లు ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. దుకాణాలు, రోడ్లను పూర్తిగా ఖాళీ చేయనున్నట్లు వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతీ ఒక్క పౌరుడిని తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
చైనా తర్వాత అత్యధికంగా వైరస్ విస్తరిస్తోన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఆ దేశంలో కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్క రోజే 85 మంది మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్లో ఒకే రోజు సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 514కు ఎగబాకింది.
ఈ నేపథ్యంలో ఇరాన్ అధినేత అయతుల్లా ఖమైనీ ఆదేశాల మేరకు సైన్యం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
ల్యాబ్ ఏర్పాటుకు నిరాకరణ
ఇరాన్లో ఉన్న భారతీయులకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ల్యాబరేటరీ ఏర్పాటు కోసం అక్కడి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. భద్రతా కారణాలు చూపి ల్యాబ్ ఏర్పాటుకు ఇరాన్ నిరాకరించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఇరాన్లో ఉన్న 1,200 మంది భారతీయుల నమూనాలను పరీక్షల నిమిత్తం భారత్‌కు తీసుకొచ్చారు. నమూనాల సేకరణ కోసం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన నలుగురు శాస్త్రవేత్తలను ఇరాన్‌కు పంపించింది భారత ప్రభుత్వం. ప్రస్తుతం వారందరూ టెహ్రాన్‌లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారికి భద్రత కల్పించలేమని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
ఇరాన్లో దాదాపు 1200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇందులో దాదాపు వెయ్యి మంది మత్స్యకారులు, మిగిలిన వారిలో విద్యార్థులు, యాత్రికులు ఉన్నారు.
ఇదీ చదవండి: ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 44 మంది