కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్ర బిందువైన చైనా తర్వాత ఇరాన్‌లోనే అధిక మరణాలు సంభవించాయి. ఇస్లామిక్ దేశంలో ఈ సంఖ్య 107కు చేరింది. మొత్తం 3,740 కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టనుంది ఇరాన్. ప్రధాన నగరాల మధ్య చెక్‌పాయింట్స్ ఎర్పాటు చేయనుంది. పేపర్ కరెన్సీని వినియోగించవద్దని ప్రజలను కోరింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మార్చి 20 (పార్శియన్ నూతన ఏడాది) వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు ఇరాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సయీద్ నమకి.
జపాన్‌లో చర్యలు..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా.. జపాన్ మరో నిర్ణయం తీసుకుంది. చైనా, దక్షిణ కొరియా నుంచి దేశానికి వచ్చిన వారిని ప్రత్యేక నిర్బంధ శిబిరానికి తరలించనున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి షింజో అబే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఉండాలని ఈ రెండు దేశాల వారికి సూచించామని తెలిపారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడికి కిమ్ లేఖ
దక్షిణ కొరియాలో కరోనా ప్రభావంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్‌కు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ లేఖ రాశారు. ప్రజల మృతి పట్ల సంతాపం తెలిపారు. సియోల్‌లో సుమారు 6వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు లేఖ ద్వారా తెలియజేశారు కిమ్.