ఉక్రెయిన్ బోయింగ్ 737 విమానాన్ని తమ సైన్యమే కూల్చేసిందని ఇరాన్ ఒప్పుకుంది. ఇది అనుకోకుండా జరిగిన మానవతప్పిదం అంటూ వెల్లడించింది. ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ క్షిపణే కూల్చేసిందన్న ఆరోపణలను మొదటి నుంచి ఆ దేశం ఖండిస్తూ వస్తోంది. ప్రధానంగా అమెరికా, కెనడా, ఉక్రెయిన్, బ్రిటన్ దేశాలు ప్రమాదం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశాయి. చివరికి విమానం కూలిపోవడానికి తామే కారణమని ప్రకటించింది తెహ్రాన్. ప్రమాదంలో 167 మంది ప్రయాణికులు, 9మంది సిబ్బంది సిబ్బంది చనిపోయారు. అందులో ఇరాన్‌కు చెందిన వారు 82 మంది, కెనడాకు చెందిన వారు 63 మంది, ఉక్రెయిన్ వాసులు 11 మంది, మిగతావారు ఇతర దేశాల వాసులు.
శత్రు దేశపు విమానంగా భావించాం...
ఉక్రెయిన్ విమానం రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన మిలిటరీ కేంద్రం వైపు రావడంతో దాన్ని శత్రు దేశపు విమానంగా భావించామని తెలిపింది ఇరాన్. ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని, ఆ సమయంలో విమానం ఆ ప్రాంతంలో కంటపడగా.. వెంటనే కూల్చినట్లు చెప్పింది.