- గాజాలో 230 మరణాలు.. అందులో 65మంది చిన్నారులు, 39 మంది మహిళలు.. 1700 మందికి గాయాలు
- ఇజ్రాయెల్‌లో 12 మంది బలి
- ఇరువైపులా భారీగా ఆస్తి నష్టం..
- యుద్ధభయంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పారిపోయిన వారు ఇంకెందరో.
ఈజిప్టు ప్రతిపాదనతో తాజాగా ముగిసిన హమాస్ ఉగ్రవాదులు- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మిగిల్చిన విషాదం ఇదీ..
ఇజ్రాయెల్, పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదుల మధ్య కొద్దిరోజులుగా భీకరదాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు గాజాలోని బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. భయంకర బాంబు దాడుల శబ్దాలకు గాజా వాసులకు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. ఇజ్రాయెల్ దాడుల్లో 230 మంది చనిపోయారు.
ఉగ్రవాదుల ప్రతిదాడులకు ఇజ్రాయెల్‌వైపు కూడా ఆస్తి నష్టం సంభవించింది. ఐదేళ్ల బాలుడు, పదహారేళ్ల బాలిక సహా మొత్తం 12 మంది చనిపోయారు.
హింసను విడనాడాలన్న ఈజిప్టు ప్రతిపాదనతో ఇరు వర్గాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. అమెరికా సహా ఇతర దేశాలు కూడా ఇరుదేశాలకు పలు మార్లు విజ్ఞప్తి చేశాయి. ఫలితంగా.. 11 రోజుల సంఘర్షణకు తెరపడింది.
తిరుగుపయనం..
ఇజ్రాయెల్ సైన్యం క్షిపణి దాడులతో భీతిల్లిన పాలస్తీనాకు చెందిన ఎన్నో కుటుంబాలు.. గాజా నగర శివార్లలోని ఇతర ప్రాంతాలకు పారిపోయాయి.
ఇప్పుడు కాల్పుల విరమణతో.. పాలస్తీనియన్లు తమ సొంత గూటికి చేరుకుంటున్నారు.
చాలా మంది.. ఐక్యరాజ్యసమితి నడుపుతున్న పాలస్తీనా శరణార్థుల పాఠశాలల్లో(యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఆశ్రయం పొందారు.
ఇదీ చూడండి: '2020లో నిర్వాసితులైన వారి సంఖ్య 5.5 కోట్లు'
విజయ సంబరాలు..
కాల్పుల విరమణ ప్రకటన తర్వాత.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తాము విజయం సాధించామని చెప్పుకున్నారు హమాస్ సీనియర్ నాయకులు. వీధుల్లోకి చేరుకొని.. తమ మద్దతుదారులతో సంబరాలు చేసుకున్నారు హమాస్ నేత ఖలీల్ అల్ హయ్యా.
హమాస్ సైనిక మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ఏం చేయలేకపోయిందని చెప్పడం గమనార్హం.
భూగర్భ సొరంగాల్లో తమ యోధులు చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు.
తెరుచుకున్న దుకాణాలు..
కొద్దిరోజులుగా నెత్తురు పారిన పశ్చిమ గాజాలోని వీధులు మళ్లీ మునుపటి వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఇరువర్గాలు శాంతించిన గంటల్లోనే వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. జనసంచారం మొదలైంది.
ఇన్ని రోజులు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు.. తమ నిత్యవసరాల కోసం బయటకు వచ్చారు. కొందరు సంతోషంగా స్వీట్లు పంచుతూ కనిపించారు.
చైనా ఆఫర్..
ఇజ్రాయెల్ దాడులతో సతమతమైన గాజా వాసులకు చైనా అండగా నిలిచింది. అత్యవసర మానవతా సహాయంగా మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. మరో మిలియన్ డాలర్లు యూఎన్ఆర్డబ్ల్యూఏకు ఇవ్వనున్నట్లు తెలిపారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్.
గాజా ప్రజలకు 2 లక్షల టీకా డోసులను కూడా అందించనున్నట్లు వెల్లడించింది చైనా.
ఇవీ చూడండి: గాజాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం