పాలస్తీనాలోని గాజాపై సైనిక చర్యను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న తీవ్రమైన ఒత్తిడి ఫలించింది. 11రోజులుగా పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు అంతమై శాంతికి బాటలు పడ్డాయి. గాజాపై ఏకపక్ష కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఇజ్రాయెల్‌ప్రధాని బెంజమిన్‌నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది.
పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్ పోలీసులు మధ్య ఇటీవలే చెలరేగిన ఘర్షణలు రెండు దేశాలను యుద్ధం అంచుకు నెట్టాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ- హమాస్ ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు రాకెట్ దాడులతో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 227మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 64మంది చిన్నారులు, 38మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద 58వేల మంది ఇళ్లను విడిచి వసలవెళ్లిపోయారు.
బైడెన్ హర్షం..
ఇజ్రాయెల్ తీసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం నిర్ణయంపై.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా-ఇజ్రాయెల్లో శాంతి నెలకొల్పేందుకు ఇదో మంచి అవకాశం అని అభివర్ణించారు. ఇరు ప్రాంతాల వారికి స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించే హక్కు ఉందని అన్నారు. ఘర్షణలు తలెత్తకుండా చూసేందుకు అమెరికా ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు.