టర్కీలో మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం వాన్ ప్రావిన్స్‌లోని బషెసరీ పట్టణ సమీపంలో మంచుచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం 300 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో మరోసారి మంచుచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో సహాయక బృందాలకు చెందిన 33 మంది మంచులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు టర్కీ అత్యవసర, విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. వాహనాల్లో ఉన్న మరో ఐదుగురు మరణించినట్లు వెల్లడించింది.
తొలిసారి మంచుచరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి 8 మందిని కాపాడినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరికొందరు మంచు కింద చిక్కుకుపోయినట్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
సహాయక చర్యలు
సిబ్బందితో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రహదారులపై భారీగా మంచు పేరుకుపోయి రవాణాకు అవరోధాలు ఏర్పడుతున్నప్పటికీ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.