76 th Independence day of India: 76వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా-భారత్ సహజ భాగస్వాములన్న బైడెన్.. భవిష్యత్తులో ఆ బంధం మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని కీర్తించిన బైడెన్.. మహాత్మా గాంధీ ప్రభోదించిన సత్యం, అహింస సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. సవాళ్ల పరిష్కారంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా పరస్పరం సహకరించుకుంటాయని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన బంధం వల్ల అమెరికా-భారత్ భాగస్వామ్యం బలపడిందని బైడెన్ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో కలిసి ఉజ్వల భవిష్యత్తు నిర్మిస్తామని బ్లింకెన్ అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత్కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్.. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం గుర్తించే విజయాలను సాధించిందని అన్నారు పుతిన్. ఇతర రంగాల్లోనూ భారత్ ప్రతిష్ఠ.. ప్రపంచ వేదికపై గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. భారత్కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అన్నారు మేక్రాన్. 75 ఏళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలకు అభినందనలు తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ పక్షాన ఫ్రాన్స్ ఉంటుందని వెల్లడించారు మేక్రాన్.
మరోవైపు మాల్దీవుల విదేశాంగ మంత్రి, అబ్దుల్లా షాహిద్ కూడా భారత్కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్- మాల్దీవుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు అబ్జుల్లా.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ తన భారత పర్యటనల గురించి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. భారత్కు 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అల్బనీస్. గౌరవం, స్నేహం, సహాకారం స్పూర్తితో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అల్బనీస్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. భారత్ సాధించిన విజయాలు అద్భుతమైనవని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అన్నారు. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి డాక్టర్ నారాయణ్ ఖడక్ కూడా భారత్ 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి: కోహినూర్ సహా ఆంగ్లేయులు కొల్లగొట్టినవెన్నో
అగ్రరాజ్యం తగ్గేదేలే, తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం