MONKEYPOX OUTBREAK: పశ్చిమ ఆఫ్రికాలో మొదలై ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ను అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించడంపై ఇన్ని రోజులుగా తటపటాయించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతుంటడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తుది నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలిగిన సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్'నే అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. ఓ దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనగా మారిన అసాధారణ పరిస్థితుల్లో దీనిని ప్రకటిస్తారు. తద్వారా అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో తీసుకొచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్‌ఆర్) ప్రకారం.. అన్ని దేశాలు హెల్త్ ఎమర్జెన్సీపై కచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి.
Monkeypox cases in India: భారత్‌లోనూ ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మూడు కేసులు బయటపడ్డాయి. ఆ మూడు కేసులూ కేరళలోనే వెలుగుచూడటం గమనార్హం. దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల విమానాశ్రయాలు, ఓడరేవులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రయాణికులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: