Virgin Airlines Takes Off First SAF Based Flight : వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం.. 100 శాతం వంట నూనెను ఇంధనంగా ఉపయోగించి ప్రయాణించిన తొలి వాణిజ్య విమానంగా రికార్డ్ సృష్టించింది.
లండన్ నుంచి న్యూయార్క్‌కు..
వర్జిన్ అట్లాంటిక్ కంపెనీకి చెందిన ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం.. లండన్‌లోని హీత్రో నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రయాణించింది. ఈ విధంగా జెట్ ఫ్యూయెల్ వాడకుండా.. పూర్తిగా 100 శాతం వంట నూనెను (సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్) ఇంధనంగా ఉపయోగించి.. 38వేల అడుగుల ఎత్తులో, అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణించి చరిత్ర సృష్టించినట్లు వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ వెల్లడించింది.
ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో.. వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ మార్క్ హార్పర్ సహా కొంత మంది సిబ్బంది మాత్రమే ప్రయాణించారు.
రాయల్ ఎయిర్‌ఫోర్స్ కూడా..
గతంలో రాయల్ ఎయిర్‌ఫోర్స్ సరకు రవాణా విమానం కూడా సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్‌తో నడిచింది. కానీ ప్రపంచంలో తొలిసారిగా 100% వంట నూనెతో నడిచిన తొలి ప్రయాణికుల విమానం మాత్రం వర్జిన్ అట్లాంటిక్ మాత్రమే కావడం విశేషం.
SAF అంటే ఏమిటి?
విమానాలు సాధారణంగా జెట్ ఫ్యుయెల్ ఆధారంగానే ప్రయాణిస్తుంటాయి. కానీ, ఈ ఫ్యూయెల్ వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. అందుకే దీనికి ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సుస్థిర విమాన ఇంధనం (Sustainable Aviation Fuel) తయారీపై ఇంధన సంస్థలు దృష్టి సారించాయి.
SAFను దేనితో తయారు చేస్తారు?
సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్‌ను.. పునరుత్పాదక బయోమాస్, వ్యర్థాలు, క్యామెలీనా సహా రకరకాల పదార్థాలతో తయారుచేస్తారు. అలాగే మనం వంటలు చేసిన తరువాత మిగిలిపోయిన నూనెలు, కొవ్వు పదార్థాలను కూడా దీని కోసం వాడతారు.
వాస్తవానికి సంప్రదాయ విమాన ఇంధనంలోనూ, గరిష్ఠంగా 50 శాతం వరకు ఈ SAFను వాడుకోవచ్చు. ఎందుకంటే.. 2011లోనే వాణిజ్య విమాన ప్రయాణాలకు కూడా SAFను వాడుకునేందుకు ఆమోదం లభించింది.
జనవరిలో అన్ని కార్ల ధరలు హైక్? ఈలోగా కొనుక్కోవడమే బెటర్?
రెనో న్యూ-జెన్ Duster కార్ ఆవిష్కరణ - లుక్స్, ఫీచర్స్ అదుర్స్!