Mike Tyson News: దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్ మైక్ టైసన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విమానంలో తోటి ప్రయాణికుడిపై అతను పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆవేశంలో పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ దెబ్బకు బాధితుడి మొహం నుంచి రక్తం చిందింది. అమెరికా శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్లే విమానంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
Mike Tyson Video: అయితే తన సీట్లో ప్రశాంతంగా కూర్చున్న మైక్ టైసన్‌ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. టైసన్‌ను పలుమార్లు వేధించడమే గాక.. వాటర్ బాటిల్‌ను కూడా అతనిపైకి విసిరినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన మైక్.. తన సీట్లోనుంచి లేచి వెనకాల ఉన్న వ్యక్తిని చితకబాదాడు. ఆ తర్వాత బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చింది. దీంతో అతడు ముఖం అదోలా పెట్టి కెమెరావైపు చూశాడు. ప్రయాణికుడు టైసన్‌తో దురుసుగా ప్రవర్తించడం వల్లే ఇలా జరిగిందని మైక్ టైసన్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Mike Tyson punching airline passenger: ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. చిన్నపాటి గాయాలే కావడం వల్ల ఆ వ్యక్తికి చికిత్స అక్కడే అందించారు. అయితే ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు అతను నిరాకరించినట్లు అధికారులు చెప్పారు. అనంతరం ఇద్దరినీ విడిచిపెట్టామని, తదుపరి విచారణ ఇంకా జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న సారా బుర్చ్ఫీల్డ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టైసన్ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తిని ముందుగా విమానాశ్రయంలోని బార్లో చూశానని.. అతను తాగి ఉన్నాడని పేర్కొన్నారు. బిగ్గరగా అరుస్తూ గోల చేశాడని వివరించారు. మొదట టైసన్, ఆ వ్యక్తి మాట్లాడుకున్నారని, ఆ తర్వాత కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు.
ఇదీ చదవండి: 'మరియుపోల్‌కు విముక్తి..' ఆ ప్రాంతాన్ని చట్టుముట్టొద్దని పుతిన్ ఆదేశం