US Mass Shooting News : అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో ఉలిక్కిపడింది. మైనే రాష్ట్రం లెవిస్టన్ నగరంలోని బార్, బౌలింగ్ అలేలో జరిగిన కాల్పుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 13 మంది వరకు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రద్దీగా ఉన్న ఈ ప్రాంతాల్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.. ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
అమెరికా మిలిటరీలో పనిచేసిన ఆయుధాల శిక్షకుడే!
Mass Shooting USA : కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫొటోను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పించాడు. గతంలో అతడు అమెరికా మిలిటరీలో పనిచేసిన ఆయుధాల శిక్షకుడని అనుమానిస్తున్నారు. నిందితుడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే లెవిస్టన్ నగరంలోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందినట్లు పోలీసులు వెల్లడించారు.
'అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'
Mass Shooting Today : కాల్పుల అనంతరం నిందితుడు పరారయ్యాడని, అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు చెప్పారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని ప్రజలను కోరారు. నిందితుడి వద్ద ఆయుధం ఉందని, అతడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని హెచ్చరించారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి 8 మైళ్ల దూరంలోని లిస్బన్ ప్రాంతంలో ఓ అనుమానాస్పద కారును గుర్తించిన పోలీసులు.. అది నిందితుడిదే కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు, లెవిస్టన్ కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్‌కు సమాచారం అందినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. మైనే గవర్నర్ జానెత్ మిల్స్‌తోపాటు సెనెటర్లతో బైడెన్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మైనేకు అండగా ఉంటామని బైడెన్ హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ పేర్కొంది.
మాల్‌లోకి చొరబడి కాల్పులు.. 8 మంది మృతి.. నిందితుడు హతం
అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి.. నిందితుడిని పట్టిస్తే 10వేల డాలర్ల రివార్డ్!