అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ విమానం విద్యుత్ టవర్‌ను ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. టవర్‌ను ఢీకొట్టగానే విమానం విద్యుత్ వైర్ల మధ్య ఇరుక్కుపోయింది. న్యూయార్క్ నుంచి ఈ సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. గైతెర్స్బర్లోని మాంట్గోమేరీ కౌంటీ ఎయిర్‌పార్క్ వద్ద సాయంత్రం 5.40 గంటలకు విమానం ప్రమాదానికి గురైంది. వంద అడుగుల ఎత్తులోనే విమానం చిక్కుకుపోయింది.
విమానంలో పైలట్ పాట్రిక్ మెర్కెల్(65), జాన్ విలియమ్స్(66) అనే ప్రయాణికుడు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిద్దరికి తీవ్రగాయాలయ్యానని చెప్పారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "ముందుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగిస్తాం. అప్పుడు సహాయక చర్యలకు ఆటంకం లేకుండా ఉంటుంది. ప్లేన్‌ను కదలనీయకుండా చేసి.. బకెట్ ట్రక్కుల ద్వారా అందులోని ఇద్దరిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తాం. విమానంలో ఉన్నవారితో సెల్‌ఫోన్ ద్వారా సంభాషణ జరుపుతున్నాం" అని మాంట్గోమేరీ కౌంటీ అగ్నిమాపక దళ అధికారి స్కాట్ గోల్డ్‌స్టెయిన్ పేర్కొన్నారు.
లక్ష మందికి కరెంట్ కట్!
ఘటన కారణంగా మాంట్గోమేరీ కౌంటీలో లక్షా 20 వేల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా అనేక ట్రాఫిక్ లైట్లు ఆగిపోయాయని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు పూర్తైన తర్వాతే.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.