Diwali Holiday In New York : అమెరికాలోని న్యూయార్క్‌లో దీపావళి పండుగరోజును సెలవు దినంగా ప్రకటించారు. దీపావళి రోజు పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించాలని ప్రవేశపెట్టిన బిల్లును న్యూయార్క్ అసెంబ్లీ, సెనెట్ ఆమోదించినట్లు మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. గవర్నర్ సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుందని చెప్పారు. బ్రూక్లీన్-క్వీన్స్ డే సెలవు స్థానంలో దీపావళిని చేర్చారు. భారత సంతతితో పాటు దీపావళి పండుగ చేసుకునే అన్నివర్గాలకే కాదు.. మొత్తం న్యూయార్క్‌కే విజయమని మేయర్ ఎరిక్ ఆడమ్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది అందరికీ ముందుగా వచ్చిన 'శుభ్ దీపావళి' అని మేయర్ ఆడమ్స్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ఏడాది నుంచి న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజు సెలవుగా ప్రకటిస్తారు. దక్షిణాసియా, ఇండో-కరేబియన్ సముదాయం రెండు దశాబ్దాలకుపైగా చేస్తున్న పోరాటానికి దక్కిన విజయమని.. న్యూయార్క్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి ఇండో-అమెరికన్ జెన్నిఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
2021లోనూ పెట్టారు కానీ..
US Diwali Holiday : దీపావళి అంటేనే వెలుగులు విరజిమ్మే పండగ. మన దేశంలో గొప్ప పండగలలో ఇది ప్రధానమైనది. ఈ పండగను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో సహా విదేశీయులు కూడా ఘనంగా జరుపుకొంటారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను తరతరాలుగా జరుపుకొంటున్నారు. న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో పలు సంఘాలు ప్రతి సంవత్సరం ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. ఈ నేపథ్యంలోనే దీపావళికి సెలవు ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన ఈ బిల్లును భారత సంతతి చట్టసభ్యులు సహా పలు కమ్యూనిటీల నేతలు స్వాగతించారు. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ 2021లోనే యూఎస్ కాంగ్రెస్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా పలు కారణాలతో అది అప్పుడు కార్యరూపం దాల్చలేదు. తాజా ప్రకటనతో అమెరికాలో ఫెడరల్ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలిచింది.
మరో సెలవు కోసం పోరాటం
మరోవైపు దీపావళితో పాటు చాంద్రమాన కొత్త సంవత్సరం రోజున న్యూయార్క్‌లో సెలవు ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా చట్టసభ సభ్యులు, ప్రవాస సభ్యుల చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించే అవకాశం ఉంది. తాజాగా దీపావళిని సెలవుగా ప్రకటించగా.. చాంద్రమాన కొత్త సంవత్సరానికి సెలవు ఇచ్చేందుకు చట్టాన్ని రూపొందించాలని న్యూయార్క్ అసెంబ్లీ భావిస్తోంది.
ఇవీ చదవండి : Trump Diwali Celebrations: ట్రంప్ ఇంట ఘనంగా దీపావళి వేడుకలు
అమెరికాలో అట్టహాసంగా దీపావళి వేడుకలు.. వారికి బైడెన్, కమల ధన్యవాదాలు