US BIDEN UKRAINE AID: ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయాన్ని మరోమారు అందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌కు 500మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. 55 నిమిషాల పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి సాధించేందుకు.. కీవ్ సహా ఇతర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు తగ్గించుకుంటామని చెప్పిన రష్యా మాట తప్పిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా సేనలు బాంబు దాడి చేశాయని వారు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై కూడా.. దాడుల తీవ్రత పెంచిందన్న అధికారులు యుద్ధాన్ని ముగించాలన్న ఉద్దేశ్యం రష్యాకు లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజధాని కీవ్ సహా చెర్నిహివ్‌ల సమీపంలో దాడులు ఆపుతామని రష్యా చేసిన ప్రకటనను తమ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, పశ్చిమ దేశాలు అనుమానించినట్లుగా రష్యా ప్రవర్తిస్తోందని తెలిపారు. ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే పుతిన్ సేనల బాంబులు, కీవ్, చెర్నిహివ్‌లోని ఇళ్లు, దుకాణాలు, లైబ్రరీలు, ఇతర పౌర ప్రదేశాలపై పడ్డాయని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి సైన్యాన్ని తూర్పు నగరం ఇజియం, డొన్మెట్క్స్ చుట్టు మోహరించి దాడులను ముమ్మరం చేసిందని పేర్కొన్నారు.
రష్యా ప్రకటనను చెర్నిహివ్ సిటీ కౌన్సిల్ సెక్రటరీ ఒలెగ్జాండర్ లోమాకో తప్పుపట్టారు. రష్యా పూర్తిగా అబద్దం ఆడుతోందని మండిపడ్డారు. రష్యా బాంబు దాడుల్లో ఏమాత్రం తగ్గడం లేదని తెలిపారు. ఐదు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది చనిపోయారు. 40లక్షలకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లారని, అందులో సగం మంది చిన్నారులు ఉన్నారని.. ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: చర్చలు ముగిసిన గంటల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు..!