Multidimensional Poverty Index India Rank : భారత్‌లో గడిచిన 15 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) వెల్లడించింది. ఈ 15 ఏళ్ల కాలంలో భారత్.. 41.5 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని తెలిపింది. ఇది చాలా విశేషమని పేర్కొంది. ఈ మేరకు 110 దేశాల్లో పేదరికం హెచ్చుతగ్గులపై మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) పేరుతో గణాంకాలు విడుదల చేసింది. 2005-06 నుంచి 2019-21 మధ్య భారత్‌లో పేదరికం సగం తగ్గిందని వివరించింది.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 2000 నుంచి 2022 మధ్య 81 దేశాల్లో పేదరికం స్థాయులు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని నివేదిక వివరించింది. మొత్తం 25 దేశాల్లో పేదరికం సగానికి తగ్గిందని తెలిపింది. ఇందులో కంబోడియా, చైనా, కాంగో, హోండురస్, భారత్, ఇండోనేసియా, మొరాకో, సెర్బియా వియత్నాం దేశాలు ఉన్నట్లు వెల్లడించింది. చైనాలోనూ పేదరికం భారీగా తగ్గినట్లు యూఎన్డీపీ వెల్లడించింది. చైనాలో 2010 నుంచి 2014 మధ్య 6.9 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డట్లు తెలిపింది. ఇండోనేసియాలో 2012 నుంచి 2017 మధ్య 80 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది.
ఈ గణాంకాల విడుదల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళిక (యూఎన్డీపీ) కీలక వ్యాఖ్యలు చేసింది. పేదరికాన్ని తగ్గించడం సాధ్యమేనన్న విషయం ఈ నివేదిక స్పష్టం చేస్తోందని తెలిపింది. అయితే, కరోనా మహమ్మారికి సంబంధించిన సమగ్ర సమాచారం తగినంతగా లేకపోవడం.. తక్షణ ప్రభావం అంచనా వేయడానికి సవాల్‌గా మారిందని వ్యాఖ్యానించింది.
దేశంలో బిహార్ టాప్
అంతకుముందు దేశంలో తొలిసారిగా రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని విడుదల చేసింది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే.. ఆక్స్ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్(ఓపీహెచ్ఐ), ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) పద్ధతులను ఉపయోగించి భారత జాతీయ ఎంపీఐని రూపొందించింది నీతి ఆయోగ్. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన విధానం వంటి మూడు కీలక అంశాలను బేరీజు వేసినట్లు తెలిపింది. అందులో పోషకాహారం, పిల్లలు, పెద్దవారి మరణాలు, పాఠశాల హాజరు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, పక్కా ఇళ్లు, బ్యాంకు ఖాతాలు వంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో అత్యంత పేద రాష్ట్రంగా బిహార్ నిలవగా.. ఆ తర్వాత ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి : పేదరికంలో బిహార్ టాప్.. ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఇలా...
ఇంకా తగ్గని ఆకలి బాధలు.. హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు 107 స్థానం!