Ukraine Russia War: రష్యాతో చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు వ్యూహాత్మకంగా శత్రుసేనలను మట్టుబెడుతున్నాయి. ఖార్కివ్ నగరంలో నదిని దాటేందుకు ప్రయత్నించిన రష్యా కాన్వాయ్‌ని ధ్వంసం చేశాయి. రష్యా బలగాలను అడ్డుకునేందుకు.. పాంటూన్ వంతెనను కూడా కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో చాలామంది పుతిన్ సైన్యం చనిపోవడం సహా ముఖ్యమైన ఆయుధ సామగ్రి ధ్వంసమైనట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. ఒక బెటాలియన్‌కు చెందిన దాదాపు వెయ్యి మంది రష్యా సైనికులు చనిపోయినట్లు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. మరోవైపు నల్ల సముద్రంలో ఒక రష్యా నౌకకు నిప్పు పెట్టినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నగరాల నుంచి పుతిన్ సైన్యాన్ని జెలెన్‌స్కీ సేనలు వెనక్కి పంపుతున్నాయి. నెలక్రితం రాజధాని కీవ్ సహా ఈశాన్య ప్రాంతాల నుంచి రష్యా దళాలు వైదొలిగిన తర్వాత ఉక్రెయిన్‌లోనే రెండో పెద్ద నగరమైన ఖార్కివ్ నుంచి వేగంగా వెనక్కి తరుముతున్నాయి. ఖార్కివ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డొనెట్స్ నది ఒడ్డున ఉన్న ప్రాంతమంతా ఉక్రెయిన్ అధీనంలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ ధ్రువీకరించింది.
అటు యుద్ధనేరాలపై విచారణను ఉక్రెయిన్ అధికారులు ప్రారంభించారు. రష్యా బలగాలు వదిలి వెళ్లిన తర్వాత.. ఏ నగరంలో చూసినా శవాల గుట్టలే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా బుచా పట్టణంలో పుతిన్ సేనల నరమేధాన్ని యావత్ ప్రపంచం ఖండించింది. యుద్ధం సమయంలో అదుపులోకి తీసుకున్న 21 ఏళ్ల రష్యా సైనికుడిని ఉక్రెయిన్ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 28న రష్యా సైనికుడైన వాదిమ్ షిషిమరిన్ 62 ఏళ్ల ఉక్రెయిన్ వృద్ధుడిని కాల్చిచంపినట్లు అభియోగాలు మోపారు. రష్యా సైనికులు 10 వేలకు పైగా యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ నేరాలు నిరూపితమైతే ఉక్రెయిన్ క్రిమినల్ కోడ్ ప్రకారం షిషిమరిన్‌కు జీవితఖైదు విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో.. తదుపరి వాదనలను ఈనెల 18న కొనసాగిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
ఇదీ చూడండి : ఉత్తర కొరియాను కుదిపేస్తున్న కరోనా.. 3.5 లక్షల మంది క్వారంటైన్!