Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో పౌరుల దారుణ హత్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో.. భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి మాట్లాడారు. బుచా హత్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యలకు సంబంధించి వచ్చిన వార్తలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని అన్నారు. వీటిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిలుపునిచ్చారు. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే దౌత్యమే అత్యుత్తమ మార్గం అని తిరుమూర్తి అన్నారు.
"ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చివరి సారిగా చర్చించినప్పటి నుంచి అక్కడ పరిస్ధితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడలేదు. ఉక్రెయిన్‌లో భద్రత సహా మానవతా పరిస్ధితి ఇంకా క్షీణించింది. బుచాలో పౌరులను చంపడంపై ఇటీవల వచ్చిన వార్తలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ హత్యలను నిస్సందేహంగా ఖండించాలి. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇవ్వాలి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం చేయడంపై అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం."
-టి.ఎస్.తిరుమూర్తి, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి
ఉక్రెయిన్‌లో దిగజారుతున్న పరిస్ధితుల పట్ల భారత్ ఆందోళనగా ఉందని తెలిపారు. అక్కడ తక్షణమే హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఐక్యరాజ్యసమితి లోపల, వెలుపల దేశాలన్నీ నిర్మాణాత్మకంగా, ఉమ్మడిగా పని చేయాలని తిరుమూర్తి సూచించారు. ఉక్రెయిన్‌కు ఔషధాలు సహా మానవతా సాయం చేసేందుకు అన్ని దేశాలు సానుకూలంగా స్పందించగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసంపై విచారణ మళ్లీ వాయిదా