Ukraine Crisis: రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ముమ్మరంగా దాడులు చేపట్టాయి. అత్యంత కీలక పారిశ్రామిక నగరం క్రెమెన్‌చుక్‌లోని చమురు శుద్ధి కర్మాగారంపై విరుచుకుపడ్డాయి. వరుసగా 12 క్షిపణులను ప్రయోగించాయి. ఈ ధాటికి అక్కడి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. తీర నగరం మేరియుపొల్, పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లలో పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాలు భీకరంగా పోరాడుతున్నాయి. రష్యా బలగాలు ఇళ్లు, ఆసుపత్రులు, విద్యార్థులు ఉండే డార్మెటరీలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ ధాటికి డాన్‌బాస్‌లో నలుగురు, చెర్నిహైవ్‌లో ముగ్గురు, ఖర్కివ్‌లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాలపైనా మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి. మిగతాచోట్ల మాత్రం జెలెన్‌స్కీ బలగాలు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో చేజారిన పలు పట్టణాలు, గ్రామాలను తిరిగి చేజిక్కించుకున్నాయి. నల్లసముద్రంలో రష్యాకు చెందిన మరో యుద్ధనౌకను తమ సేనలు మట్టుబెట్టాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారుడు ఒలెక్సీ అరెస్టోవిచ్ పేర్కొన్నారు. తూర్పు ప్రాంతంలోని సివెర్‌స్కీ దొనెట్స్ నదిని దాటేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సైనికులపై ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడ్డాయి. దీంతో మాస్కోకు భారీగా సైనిక నష్టం వాటిల్లింది. అత్యంత ముఖ్యమైన పరికరాలనూ కోల్పోయింది. విద్యా సంస్థలను ధ్వంసంచేస్తే రష్యాకు ఏం వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఇప్పటివరకూ 101 ఆసుపత్రులను, 570 వైద్య వసతులను రష్యా సైనికులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
'ఈ పరిస్థితి తెచ్చింది నువ్వే..': ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం క్రమంలో- నాటోలో చరిత్రాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కూటమిలో చేరడానికి అవసరమైన దరఖాస్తు ప్రక్రియ చేపట్టేందుకు ఫిన్లాండ్ సుముఖత వ్యక్తంచేసింది. స్వీడన్ కూడా మరికొద్ది రోజుల్లో ఈ దిశగా నిర్ణయం వెల్లడించనుంది. పుతిన్‌ను ఉద్దేశించి ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలీ నినిస్తో మాట్లాడుతూ- ‘‘ఈ పరిస్థితి తెచ్చింది నువ్వే. ఓసారి అద్దంలో చూసుకో’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిన్లాండ్, స్వీడన్‌లను చాచిన హస్తాలతో తాము మనసారా ఆహ్వానిస్తున్నట్టు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఈ తాజా పరిణామాలపై రష్యా ఘాటుగా స్పందించింది. తమ జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ‘సైనిక, సాంకేతిక తదితర ప్రతీకార చర్యలు’ తీసుకోవాల్సి వస్తుందని ఆ దేశ విదేశాంగశాఖ హెచ్చరించింది. ఫిన్లాండ్, స్వీడన్‌లు నాటో కూటమిలో చేరడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు టర్కీ అధ్యక్షుడు రిసప్ తయ్యపీ ఎర్డోగన్ పేర్కొన్నారు. ఖుర్దు ఉగ్రవాదులకు ఈ దేశాలు అతిథిగృహాల్లా మారినందున వాటిని కూటమిలో చేర్చుకోరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
17న భారత రాయబార కార్యాలయం సేవలు పునఃప్రారంభం: యుద్ధం కారణంగా రాజధాని కీవ్ నుంచి పోలండ్‌లోని వార్సాకు మార్చి 13న తాత్కాలికంగా మార్చిన భారత రాయబార కార్యాలయం.. తిరిగి ఈనెల 17 నుంచి కీవ్‌లో సేవలను పునఃప్రారంభిస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్‌లో మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరుగుతోందంటూ జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలి ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. తీర్మానానికి 34 దేశాలు మద్దతు తెలపగా, భారత్ సహా 12 దేశాలు గైర్హాజరయ్యాయి. తీర్మానానికి అనుకూలంగా చైనా, ఎరిత్రియాలు ఓటు వేశాయి.
రష్యా సైనికుడిపై యుద్ధ నేరాల కింద విచారణ: తమ పౌరులను దారుణంగా హింసించి, చంపిన నేరం కింద రష్యా సైనికులపై ఉక్రెయిన్ విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగా రాజధాని కీవ్‌లోని కిక్కిరిసిన కోర్టు హాలులో శుక్రవారం రష్యాకు చెందిన 21 ఏళ్ల వాదిమ్ షైషిమరిన్ అనే సైనికుడిని విచారించారు. చుపాఖివ్కాలోని 62 ఏళ్ల ఉక్రెయిన్ వృద్ధుడిని వాదిన్ కాల్చి చంపినట్టు ఆరోపణలున్నాయి. పౌరులను కాల్చి చంపాలను తమకు ఆదేశాలున్నాయని, అందుకే వృద్ధుడిపై ఒక రౌండు కాల్పులు జరిపానని వాదిమ్ పేర్కొన్నాడు. నేరం రుజువైతే అతనికి జీవిత ఖైదు పడే అవకాశముంది.
పుతిన్ మాజీ భార్య, ప్రియురాలిపై బ్రిటన్ ఆంక్షలు..: రష్యన్ ప్రముఖులపై ఆంక్షల విషయంలో యూకే మరింత దూకుడు ప్రదర్శించింది. ఈ జాబితాలో అధ్యక్షుడు పుతిన్ మాజీ భార్య లియుడ్మిలా ఒచెరెట్నాయ, ఆయన ప్రియురాలుగా చెబుతున్న అలీనా కబేవాల పేర్లను చేర్చింది.
ఉక్రెయిన్‌కు ఐరోపా ఆర్థిక సాయం: రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలబడతామని జి-7 కూటమి దేశాల నేతలు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. ఆయుధాల కొనుగోలుకు అదనంగా రూ.4,027 కోట్ల (520 మిలియన్ డాలర్ల) సాయం అందిచాలని తీర్మానించింది. దీంతో ఉక్రెయిన్‌కు ఈయూ చేసిన మొతం సాయం రూ.16,264 కోట్లు (2.1 బిలియన్ డాలర్లు) కానుంది.
దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా తన బలగాలను మోహరించినా.. తూర్పు ఉక్రెయిన్‌లో ఆ దేశానికి తీవ్ర నష్టం, ఎదురుదెబ్బ తప్పడంలేదనీ; ఈ పరిణామాలతో మాస్కో కమాండర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని బ్రిటన్ రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
చర్చలకు మేం సిద్ధమే..: సంక్షోభ నివారణకు రష్యా నాయత్వంతో దౌత్యచర్చలు జరిపి, రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని... రష్యా నుంచే ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రి కులేబా చెప్పారు.
- జర్మనీకి చెందిన దిగ్గజ పారిశ్రామిక సంస్థ సీమెన్స్ ఏజీ.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రైళ్లు, పారిశ్రామిక పరికరాలు తయారుచేసే ఈ సంస్థ 170 ఏళ్లుగా రష్యాలో సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు రష్యాలు 3 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
- తమ దేశం నుంచి ఐరోపా దేశాలకు పైపులైన్ ద్వారా ఎగుమతి అవుతున్న సహజవాయుపై రష్యా ఆంక్షలు విధించడంతో.. పలు దేశాల్లో గ్యాస్ సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. పోలండన్ మీదుగా జర్మనీకి వెళ్లే పైపులైన్ ద్వారా సహజవాయు సరఫరాను నిలిపివేస్తున్నట్టు రష్యా తాజాగా వెల్లడించింది.
ఇదీ చదవండి: శ్రీలంక ఎంపీని చంపింది ఆందోళనకారులే!