Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. పుతిన్ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అంగీకరించారు. తమ సైనికుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'మా దళాలను గణనీయంగా నష్టపోయాం. ఇది మాకు భారీ విషాదం' అంటూ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడం , అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమంటూ ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌పై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అంతులేని విషాదాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలి, వలస బాటపట్టారు. అయినా సరే, ఉక్రెయిన్ రష్యాను గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఊహించని రష్యా భారీ స్థాయిలో సైన్యాన్ని కోల్పోతోంది. ఇప్పటివరకూ ఆ సంఖ్య సుమారు 18 వేల వరకూ ఉండొచ్చని ఉక్రెయిన్ చెప్పగా.. రష్యా చెప్తోన్న సంఖ్య అందుకు ఎన్నో రెట్లు తక్కువగా ఉంది. అయితే భారీ విషాదం అంటూ పుతిన్ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా స్పందన వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.
- ఉక్రెయిన్ నియంత్రణలో సుమీ: రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్ నగరం సుమీ తమ ఆధీనంలోనే ఉందని అక్కడి గవర్నర్ వెల్లడించారు. 'సుమీ ప్రాంతానికి రష్యా సైన్యం బెడద లేదు. అయితే ఈ ప్రాంతం సురక్షితంగా మాత్రం లేదు. ఇక్కడ పాతిపెట్టిన మైన్స్‌ను తొలగించాల్సి ఉంది' అంటూ తిరిగిరావాలనుకుంటోన్న ప్రజలను ఉద్దేశించి వెల్లడించారు.
ఇది వారి పనే: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూనే.. ఆ దేశంపైనే తీవ్ర ఆరోపణలు చేస్తోంది రష్యా. విచక్షణారహిత దాడులకు పాల్పడుతూ అమాయక ప్రాణాలకు బలిగొంటూ.. ఆ దాడులు ఉక్రెయిన్ చేసిందని ఆరోపిస్తోంది. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌లోని రైల్వే స్టేషన్‌పై మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో కనీసం 50 మంది మృతిచెందగా.. 400 మందికి పైగా గాయపడినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది రష్యా. ఈ దాడులకు రష్యా బలగాలే కారణమన్న ఆరోపణలను ఆ దేశ రక్షణ శాఖ ఖండించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. దాడికి ఉపయోగించిన క్షిపణులు కేవలం ఉక్రెయిన్ మిలిటరీ మాత్రమే ఉపయోగించే రకానికి చెందినవని ఆరోపించింది. మార్చి 14న డొనెట్స్క్ నగరంలో 17 మంది మృతి కారణమైన క్షిపణిని పోలి ఉందని పేర్కొన్నట్లు చెప్పింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్ ప్రాంతం క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్ దాడుల్లో కనీసం 50 మంది మృతిచెందారు. 400 మందికి పైగా గాయపడినట్టు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి అర్త్యోమ్ దెహత్యారెంకో తెలిపారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్‌లో దాదాపు నాలుగు వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు స్థానిక మేయర్ ఒలెక్సాండర్ హంచరెంకో వెల్లడించారు. ఈ దాడులతో ఆ ప్రాంతమంతా జనం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలిస్తున్న సమయంలో ఈ స్టేషన్‌లో దాడులు జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
- దాడిని ఖండించిన జెలెన్‌స్కీ: క్రమాటోర్స్క్ రైల్వేస్టేషన్‌పై రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. యుద్ధక్షేత్రంలో మాకెదురుగా నిలబడే ధైర్యం, బలం లేక.. అసహనం, విరక్తితో ఉక్రెయిన్ పౌర జనాభాను నాశనం చేస్తున్నారని రష్యా బలగాలపై విరుచుకుపడ్డారు. ‘ఇది హద్దులు లేని దుర్మార్గం. శిక్షించకపోతే.. ఎప్పటికీ ఆగదు’ అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ముంబయి పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష