Ukraine Crisis: యుద్ధంలో కీవ్‌ను స్వాధీనం చేసుకోలేకపోయిన రష్యా.. కొత్త ఆర్మీ జనరల్‌ను రంగంలోకి దింపింది. యుద్ధానికి నాయకత్వం వహించడానికి దక్షిణ మిలిటరీ కమాండర్ అలెగ్జాండర్ డ్వోర్నికోవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మే 9న జరిగే 'విక్టరీ డే' నాటికి యుద్ధరంగంలో పుతిన్ లక్ష్యాన్ని సాధించాలనే ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మే 9 'విక్టరీ డే' రష్యాలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించింది. రష్యా తమ లక్ష్యాలను చేరుకోవడానికి దాడులను మరింత ఉద్ధృతం చేస్తుందని యూకే మిలిటరీ విభాగాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై చేస్తున్న భీకర దాడులు ఆదివారం తీవ్రంగా మారాయి. పలు ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్షిపణి నిరోధక వ్యవస్థను నాశనం చేసినట్లు రష్యా ప్రకటించింది. అలాగే సాయుధ వాహనాల కాన్వాయ్‌ను మాస్కో వైమానిక దళాలు ధ్వంసం చేశాయని రష్యా మీడియా పేర్కొంది. ఖర్కివ్ రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో 66 ఫిరంగి దాడులు జరిగాయని స్థానిక గవర్నర్ ఆరోపించారు. ఇప్పటివరకు.. దేశవ్యాప్తంగా 6 వేల 800కుపైగా నివాస భవనాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ విదేశాంగశాఖ ప్రకటించింది. అలాగే 19 వేల 300 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు వివరించింది.
మరో సామూహిక సమాధి: రష్యన్ బలగాల దాడుల్లో ఈశాన్య ఖర్కివ్ ప్రాంతంలోని దెర్హాచీలో ఇద్దరు మృతి చెందినట్లు, పలువురు గాయపడినట్లు స్థానిక గవర్నర్ ఒలేహ్ సిన్యెహుబోవ్ వెల్లడించారు. మాస్కో సేనలు ఇక్కడి అనేక ప్రాంతాల్లో 66 ఫిరంగి దాడులు చేశాయని వెల్లడించారు. కీవ్‌ను చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా దాని సమీప ప్రాంతమైన బోరోడియంకా ప్రాంతాన్ని రష్యా అధీనంలోకి తెచ్చుకున్నట్లు.. స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ పౌరులపై రష్యా సేనలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కీవ్ సమీపంలో మరొక సామూహిక సమాధిని కనుగొన్నట్లు.. స్థానిక అధికారులు వెల్లడించారు. బుజోవా గ్రామంలోని.. పెట్రోల్ బంకు సమీపంలో ఓ పొడవాటి కందకంలో డజన్ల కొద్దీ పౌరుల మృతదేహాలు కనిపించాయని చెప్పారు. మృతుల సంఖ్యను నిర్ధరించాల్సి ఉందని వివరించారు.
ఇదీ చదవండి: యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయాం: రష్యా