లెపర్డ్-2..! కొద్దిరోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది. 11 నెలలుగా తనతో పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ధట్యాంకు అవసరమని ఉక్రెయిన్ గట్టిగా అడుగుతోంది. దీని తయారీదారైన జర్మనీ ఈ ఆయుధాలు త్వరలో ఉక్రెయిన్‌కు అందిస్తోంది.
ఏమిటీ లెపర్డ్-2?
లెపర్డ్ అంటే చిరుత అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ అధునాతన ప్రధాన యుద్ధ ట్యాంకు చాలా చురుగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే మేటి ఆయుధాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. జర్మనీకి చెందిన క్రాస్ మఫాయ్ వేగ్‌మన్ (కేఎండబ్ల్యూ) సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. లెపర్డ్-1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి. ప్రస్తుత లెపర్డ్-2 కాల్పుల సామర్థ్యం అమోఘం. వేగం, చురుగ్గా ఎటైనా కదిలే ఒడుపు దీని సొంతం. ఇందులోని ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది. ఈ ప్రత్యేకతల దృష్ట్యా ఇది అనేక రకాల యుద్ధ క్షేత్రాలకు అనువుగా ఉంటుంది.
ఎన్ని కావాలి?
ప్రస్తుత యుద్ధంపై లెపర్డ్-2 ట్యాంకులు ఏదైనా ప్రభావం చూపాలంటే కనీసం 100 ట్యాంకులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే 300 ట్యాంకులు కావాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి కోరుతున్నారు.
ఉక్రెయిన్‌కు ఎందుకు అవసరం?
11 నెలల యుద్ధంలో చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన యుద్ధ ట్యాంకులతో భారీగా దాడికి దిగాలని భావిస్తోంది. ఇందుకు లెపర్డ్-2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.
ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం 1970ల నాటి టి-72 ట్యాంకులు ఉన్నాయి. వాటిలో సుదూర లక్ష్యాలను గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో సాయపడే ఫైర్ కంట్రోల్ వ్యవస్థ లేదు. పైగా ఈ ట్యాంకుల్లో మందుగుండును ప్రధాన ట్యాంక్ కంపార్ట్‌మెంట్‌లో నిల్వ చేయాలి. శత్రు దాడికి గురైనప్పుడు ఇవి పేలిపోయి సొంత బలగాలకు పెను నష్టాన్ని కలిగిస్తాయి. లెపర్డ్-2తోపాటు పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకుల్లో ఈ మందుగుండును భద్రపరచుకోవడానికి ప్రత్యేక రక్షిత కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
- లెపర్డ్-2, పశ్చిమ దేశాలకు చెందిన ఇతర ఆధునిక ట్యాంకులు.. రష్యా వద్ద ఉన్న టి- శ్రేణి శకటాల కన్నా చాలా మెరుగైనవి.
- లెపర్డ్-2లో నాటో ప్రామాణీకరించిన 120 ఎంఎం మందుగుండు ఉపయోగిస్తారు. వీటి సరఫరాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఉక్రెయిన్ వాటిని భారీగా సమకూర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆ దేశ ట్యాంకులు 125 ఎంఎం మందుగుండును ప్రయోగించగలవు.
మిగతా దేశాల సంగతేంటి?
అమెరికా వద్ద మరింత శక్తిమంతమైన ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్‌కు సరఫరా చేయడానికి అగ్రరాజ్యం నిరాకరించింది. సంక్లిష్టమైన ఈ ఆయుధాల నిర్వహణ చాలా కష్టమని, ఇవి ఉక్రెయిన్‌కు అక్కరకురావని చెబుతోంది. వీటికి బదులు 100 స్రైకర్ సాయుధ శకటాలు, 50 బ్రాడ్లీ పోరాట వాహనాలను సరఫరా చేసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తన మనసు మార్చుకొని అబ్రామ్స్ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందిస్తే జర్మనీ కూడా లెపర్డ్-2లను నేరుగా సరఫరా చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
- లెపర్డ్-2 ట్యాంకులు డీజిల్‌తో నడుస్తాయి. ఎం1 అబ్రామ్స్‌కు జెట్ ఇంధనం అవసరం. అందువల్ల అమెరికా ట్యాంకులతో పోలిస్తే జర్మన్ ట్యాంకుల నిర్వహణ ఉక్రెయిన్‌కు సులువని నిపుణులు వాదిస్తున్నారు.
- ఉక్రెయిన్‌కు 14 ఛాలెంజర్-2 ట్యాంకులను సరఫరా చేస్తామని బ్రిటన్ ఇటీవల హామీ ఇచ్చింది. ఇవి కూడా శక్తిమంతమైనవే. అయితే బ్రిటన్ వద్ద 227 ఛాలెంజర్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో వాటిని సరఫరా చేయడం సాధ్యం కాదు.
- చెక్ రిపబ్లిక్, పోలండ్.. సోవియట్ హయాం నాటి టి-72 ట్యాంకులను ఉక్రెయిన్‌కు సరఫరా చేశాయి. తన లీక్లర్క్ ట్యాంకులను అందించే అంశాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తోంది.
శిక్షణ అవసరం..
ఒకవేళ మిత్రదేశాలు లెపర్డ్-2లను సరఫరా చేసినా.. వాటిని ఆగమేఘాల మీద వినియోగంలోకి తీసుకురావడం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదు. ఈ ట్యాంకుపై కనీస స్థాయి పట్టు సాధించడానికి సైనిక, నిర్వహణ సిబ్బందికి 3-6 వారాల శిక్షణ అవసరం. ట్యాంకును గరిష్ఠస్థాయిలో వినియోగించుకోలేకపోయినా.. స్వల్పకాలంలో 80 శాతం సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నా చాలని ఉక్రెయిన్ భావిస్తోంది.
అంతమాత్రానే గెలుపు సాధ్యం కాదు..
ఆధునిక ట్యాంకులను మోహరించి, యుద్ధంలో గెలిచేస్తామని భావించరాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోవాలంటున్నారు. వీటికితోడు సాయుధ శకటాలూ కావాలి. ఉక్రెయిన్ ట్యాంకులకు రష్యా యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల నుంచి ముప్పు ఉంది. వాటిని ఎదుర్కోవడానికి విమాన విధ్వంసక, నిఘా వ్యవస్థల అవసరం ఉంది. కొత్త ట్యాంకులను పదాతి, శతఘ్ని దళాలు, ఇతర విభాగాలతో సమన్వయపరచుకోవాలి.
- పశ్చిమ దేశాల యుద్ధట్యాంకులు మెరుగైనవే అయినప్పటికీ వాటిని సరఫరా చేస్తున్న దేశాలు నష్టాలకూ సిద్ధం కావాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. యుద్ధంలో వాటిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
- ఇవీ చదవండి:
- ఈజిప్ట్‌తో వ్యూహాత్మక బంధం.. 1200 కోట్ల డాలర్లకు ద్వైపాక్షిక వాణిజ్యం!
- న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ ప్రమాణం