మరణ శిక్ష పడిన ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీఫక్కీలో తప్పించుకోవడం బంగ్లాదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ బంగ్లాదేశ్- అమెరికన్ బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్‌ల హత్య కేసుల్లో ఈ ఇద్దరికి గతేడాది మరణ శిక్ష పడింది. ఈ క్రమంలోనే.. పేరుమోసిన నేరస్థులను నియంత్రించే విషయంలో పోలీసుల వైఫల్యంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్సరుల్లా బంగ్లా టీం ఉగ్రసంస్థకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు.. మొయినుల్ హసన్ షమీమ్, అబు సిద్ధిఖ్ సోహెల్‌లను వేరే కేసులో విచారణకుగానూ ఆదివారం ఢాకాలోని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిని జైలుకు తరలించేందుకు బయటకు తీసుకొచ్చారు. అంతలోనే ద్విచక్ర వాహనాలపై కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఎస్కార్ట్ పోలీసులపై రసాయనం వెదజల్లి, ఇద్దరిని ఎక్కించుకుని పరారీ కావడం గమనార్హం.
దుండగులు స్ప్రే చేసిన రసాయనంతో పోలీసులకు తాత్కాలికంగా కళ్లు కనిపించలేదని, నిందితులు ఘటనాస్థలంలో పెద్దఎత్తున పొగ వచ్చేలా చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి వెంట కేవలం ఇద్దరే ఎస్కార్ట్ పోలీసులు ఉన్నారని, హై ప్రొఫైల్ హత్య కేసుల్లోని దోషులనూ ఇతర సాధారణ ఖైదీల మాదిరిగానే పరిగణించారని కోర్టు అధికారి ఒకరు ఆరోపించారు. ఖైదీలకు కేవలం చేతులకే సంకెళ్లు వేశారని చెప్పారు.
ఇద్దరు ఉగ్రవాదులతోపాటు మిగతా నిందితులనూ పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ కమల్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మత ఛాందసవాదాన్ని బహిరంగంగా విమర్శించే అవిజిత్ రాయ్‌ను 2015 ఫిబ్రవరిలో ఉగ్రవాదులు ఢాకాలో హతమార్చారు. అప్పట్లో అమెరికా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. అదే ఏడాది నవంబర్‌లో డిపన్‌నూ చంపేశారు.