ఇప్పటికే వందలాది మందిని కోల్పోయి, తీవ్ర విషాదంలో మునిగిపోయిన తుర్కియేను వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. సోమవారం మరో రెండు సార్లు భూమి కంపించించింది. సాయంత్రం వచ్చిన ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే ఇది మూడోది.
అంతకుముందే.. తుర్కియే, సిరియా దేశాలపై ప్రకృతి ప్రకోపాన్ని చూపింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న మధ్య తుర్కియే, ఈశాన్య సిరియాలలో నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు.. అక్కడి ప్రజలను వణికించాయి. భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి 1500 మందికిపైగా మృత్యువాత పడగా.. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. రిక్టర్ స్కేల్ పై తొలుత 7.8 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. 15 నిమిషాల వ్యవధిలో మరోసారి 6.7తీవ్రతతో భూమి కంపించినట్లు US జియోగ్రాఫికల్ సర్వీస్ పేర్కొంది. భూకంపం తర్వాత దాదాపు 42సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు, అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణ తుర్కియేలోని కహ్రాన్మరస్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.6 భూకంప తీవ్రత నమోదైంది. 1939 తర్వాత వచ్చిన అతి తీవ్ర భూకంపం ఇదే అని పేర్కొన్నారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విపత్తు నిర్వహణ సిబ్బంది, సహాయక సిబ్బంది.. భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తుర్కియేలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరియాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం వచ్చిన భూకంపం ఈ శతాబ్దంలోనే సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని అధికారులు పేర్కొన్నారు. 1939 తర్వాత వచ్చిన అతి తీవ్ర భూకంపం ఇదే అని పేర్కొన్నారు.
తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. ఒక్క తుర్కియేలోనే 912 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగన్ వెల్లడించారు. 2,300 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. ఒక్క తుర్కియేలోనే 2,818 ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మధ్య తుర్కియేలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ తుర్కియేలోనూ భారీ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు.
ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలతోపాటు.. రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
భూ ప్రకంపనలకు గాజియాన్ తెప్ నగరం మధ్యలో కొండపై ఉన్న చారిత్రక కోట తీవ్రంగా ధ్వంసమైంది. ఈ కోట 2 శతాబ్దం నాటిదని అక్కడి అధికారులు తెలిపారు. కోట గోడలు, వాచ్‌టవర్లు నేలమట్టం కాగా.. మిగిలిన భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు. తుర్కియే, సిరియాల్లో జరిగిన ప్రకృతి విలయం నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయానికి వివిధ దేశాలు ముందుకువస్తున్నాయి. భూకంపం ధాటికి గాయాలైన వారితో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసినా రక్తంతో ప్రజలు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. వారికి చికిత్స అందించేందుకు వైద్యసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తుర్కియేకు సహాయ సామగ్రి, వైద్య బృందాలు
మరోవైపు.. భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాపై ప్రపంచదేశాలు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. సహాయం అందిస్తామంటూ ముందుకు వచ్చి.. రెస్క్యూ బృందాలతోపాటు వైద్య సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ.. తుర్కియేకు 100 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్లను పంపాలని ఆదేశించారు. వీటితో పాటు తుర్కియేకు సహాయ సామగ్రి, వైద్య బృందాలు పంపించాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇవీ చదవండి: తుర్కియే, సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. 360 మంది మృతి
తుర్కియే, సిరియాలో భూకంపం.. 1300 మంది మృతి.. సహాయం చేస్తామని మోదీ హామీ