అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ కంటైనర్ నుంచి రూ.123 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. కెనడాలోని టొరంటోలో ఉన్న పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. కార్గో టెర్మినల్ నుంచి ఓ కంటైనర్ కనిపించకుండా పోవడం వల్ల.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. అది బంగారంతో నిండిన కంటైనర్ అని తేలింది. ఇది అత్యంత అరుదైన దొంగతనంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా జరిగిన అతిపెద్ద చోరీ ఇదేనని అంటున్నారు.
బంగారంతో నిండిన కంటైనర్ సోమవారం సాయంత్రం ఓ విమానంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిందని స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ స్టీఫెన్ డువెస్టెయిన్ తెలిపారు. ప్లేన్‌లోని కంటైనర్లను కిందకు దించి.. కార్గో ఫెసిలిటీకి తరలించినట్లు వివరించారు. కొద్దిసేపటికి బంగారం ఉన్న కంటైనర్ కనిపించలేదని గుర్తించినట్లు తెలిపారు. ఆ కంటైనర్‌ను ఎవరో చట్టవిరుద్ధంగా తీసుకెళ్లారని అన్నారు. విమానం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తాను బయటపెట్టలేనని చెప్పారు.
"దొంగలు ఇతర విలువైన వస్తువులు సైతం చోరీ చేశారు. నిందితులు ప్రొఫెషనల్ దొంగలా కాదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ జరుగుతోంది. ముగ్గురు ఎయిర్పోర్ట్ ఉద్యోగులను అరెస్ట్ చేశాం. ఇది ఈ ఒక్కచోట జరిగిన ఘటనగానే భావిస్తున్నాం. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విమానాశ్రయానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది ప్రజా భద్రతకు సంబంధించిన అంశం కాదు."
-స్టీఫెన్ డువెస్టెయిన్, పోలీసు ఇన్స్పెక్టర్
బ్యాంకు కోసం తెచ్చిన బంగారం!
నార్తర్న్ ఒంటారియోలోని గనుల నుంచి ఈ బంగారాన్ని తీసుకొచ్చారని కెనడాకు చెందిన 'ది ఒట్టోవా సన్' వార్తా సంస్థ వెల్లడించింది. నగరంలోని ఓ బ్యాంకు కోసం ఈ బంగారాన్ని టొరంటోకు తరలించారని తెలిపింది. ప్రస్తుతం, బంగారం కెనడాలోనే ఉందా? లేదంటే దొంగలు దేశం దాటించారా అనేది తెలియాల్సి ఉంది.
2019 జులైలో బ్రెజిల్‌లోని సావో పాలో విమానాశ్రయంలో రూ.247 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. ఆ తర్వాత అతిపెద్ద దొంగతనం ఇదే. బ్రెజిల్లో జరిగిన ఘటనలో ఒక్క తూటా పేల్చకుండా.. మూడు నిమిషాల్లోపే చోరీ పూర్తి చేశారు దొంగలు. పోలీసుల వేషంలో ఆయుధాలు ధరించి ఎనిమిది మంది ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చారు. రెండు ఫేక్ పోలీసు వ్యానుల్లో వచ్చి.. న్యూయార్క్, జ్యూరిక్‌కు పంపేందుకు సిద్ధంగా ఉంచిన బంగారాన్ని చోరీ చేశారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను బందీలుగా చేసుకున్నారు. అందులో ఒకరి కుటుంబాన్ని అప్పటికే కిడ్నాప్ చేశారు. తమకు సహాయం చేయాలని బ్లాక్మెయిల్ చేసి బంగారంతో ఉడాయించారు.
అతిపెద్ద చోరీ ఇదే..
1983లో జరిగిన 'బ్రింక్స్- మాట్ రాబరీ'ని ప్రపంచంలో అతి పెద్ద బంగారం చోరీ ఘటనగా చెబుతారు. లండన్‌లోని హీథ్రూ ఎయిర్పోర్ట్ సమీపంలో మొత్తం 32 మిలియన్ డాలర్ల (రూ.263 కోట్లు) బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. ఈ ఘటనతో బ్రిటిష్ పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సి వచ్చింది.