Titanic Tourist Submarine Missing : విమానాలు, నౌకలు, రోబోలు.. సముద్రాన్ని జల్లెడ పడుతున్నా.. అట్లాంటిక్ మహా సముద్రంలో.. గల్లంతైన జలాంతర్గామి ఆచూకీ తెలియలేదు. సబ్‌మెరైన్ ఆచూకీ కోసం మూడు నౌకలను అమెరికా కోస్ట్ గార్డ్ రంగంలోకి దించింది. అమెరికా సైన్యానికి చెందిన మూడు సీ–17 రవాణా విమానాలను పంపించినట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ ప్రకటించింది. టైటాన్ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12 వేల 500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. ఇది సామాన్యమైన లోతు కాదు. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్‌నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు శీతలంగా ఉంటాయి. అంతా చీకటే ఉంటుంది. అక్కడి వరకు సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శోధించేందుకు అండర్‌వాటర్ రోబోను పంపించినట్లు తెలుస్తోంది.
Submarine missing Titanic billionaire : సబ్‌మెరైన్ ఉందని అనుమానిస్తున్న ప్రాంతానికి చేరుకోడానికి అధునాతన పరిశోధన నౌక అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిని బోస్టన్ నుంచి టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతానికి తరలించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని.. అక్కడి నుంచి సముద్ర గర్భంలోకి చేరుకునేందుకు కొన్ని గంటలు పడుతుందని ఇదంతా సుదీర్ఘ సమయం తీసుకునే వ్యవహారమని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒక పెట్రోలింగ్ విమానం, రెండు ఓడలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని కెనడా సైన్యం ప్రకటించింది.
మరోవైపు జలాంతర్గామిలో ఆక్సిజన్ నిల్వలు గురువారం సాయంత్రంతో అయిపోయి ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆక్సిజన్ నిల్వలు అయిపోయే సరికి జలాంతర్గామిని కనిపెట్టి.. అందులోని వారిని రక్షించాలని సహాయ బృందాలు విరామం లేకుండా శోధించినా.. ఇప్పటివరకు ఫలితం లేదు. ఒకవేళ ఆక్సిజన్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే ఆందోళన మొదలవుతోంది. ఆక్సిజన్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే.. అంత ఎక్కువ సమయం జలాంతర్గామిలో ఉన్న వాళ్లు సజీవంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుని ఆక్సిజన్ వాడకాన్ని తగ్గిస్తే అందులోని కుబేరులు మరిన్ని రోజులు సజీవంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Submarine Missing In Atlantic Ocean : ఆదివారం ఉదయం 6 గంటలకు జలాంతర్గామి టైటానిక్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే అందులో ఉంది. టైటాన్‌లో రెండు రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. నీటిలోకి వెళ్లిన 1.45 గంటల లోపే అవి పనిచేయడం ఆగిపోయింది. టైటాన్‌లో ఓషియన్‌గేట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్టాక్‌టన్ రష్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హర్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ నావికాదళం మాజీ అధికారి పాల్–హెన్రీ నార్జియోలెట్ ఉన్నారు. వీరందరూ క్షేమంగా బయటపడాలని ప్రపంచం కోరుకుంటోంది.