ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఓ చిన్న క్యాప్సూల్.. అక్కడి అధికారులను హడలెత్తిస్తోంది! కారణం.. అందులో రేడియో ధార్మికత పదార్థం 'సీజియం- 137' ఉండటమే. రేడియేషన్ నేపథ్యంలో ఆ గుళికను తాకడం లేదా దగ్గర ఉంచుకోవడం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని, కాలిన గాయాలవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వస్తువు ఏదైనా కనిపిస్తే దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
6 మి.మీల వ్యాసం, 8 మి.మీల పొడవు గల ఈ క్యాప్సూల్‌ను ఇటీవల ఓ ట్రక్కులో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్ ఉత్తర ప్రాంతంలోని ఓ సైట్ నుంచి పెర్త్‌కు రవాణా చేస్తుండగా.. మార్గమధ్యలో ఎక్కడో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 1400 కి.మీల మేర వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీజియం- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు.
![AUS-RADIOACTIVE-CAPSULE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17607816_australia.jpg)
ఈ గుళిక రేడియేషన్‌ను విడుదల చేస్తుందని.. దీంతో దాన్ని తాకిన, లేదా వెంట ఉంచుకున్న వారికి కాలిన గాయాలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం హెచ్చరించింది. ఆ క్యాప్సూల్ ఫొటోను విడుదల చేసింది. ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని డీఎఫ్‌ఈఎస్ సూచించింది.