నిత్యం యుద్ధ కాంక్షతో రగిలిపోయే చైనా తన అణుశక్తిని అమాంతం పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అణ్వాయుధాలను భవిష్యత్‌లో ప్రస్తుతమున్న దాని కంటే నాలుగు రెట్లు పెంచుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా చైనా అడుగులు సైతం వేస్తున్నట్లు అమెరికా రక్షణ కార్యాలయం 'పెంటగన్' వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద 400 అణ్వాయుధాలు ఉండగా వాటిని 2035 నాటికి 1500 పెంచేందుకు డ్రాగన్ చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది. చైనా మిలటరీ నిర్మాణాలపై అమెరికా చట్టసభలకు సమర్పించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం అణు ఆధునీకరణపై చైనా దృష్టి కేంద్రీకరించినట్లు పెంటాగన్ స్పష్టం చేసింది. భూమి, సముద్రం, వాయు ఆధారిత అణ్వాయుధ తయారీ కేంద్రాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. అణు కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను డ్రాగన్ నిర్మిస్తున్నట్లు వివరించింది.
2021 ఏడాది నుంచే చైనా తన అణు విస్తరణను వేగవంతం చేసిందని పెంటగన్ నివేదిక తెలిపింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, రీప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణ ద్వారా ఫ్లుటోనియం ఉత్పత్తితో పాటు దాన్ని వేరు చేసే సామర్థ్యాన్ని చైనా పెంచుకుంటున్నట్లు చెప్పింది. అటు, తైవాన్ అంశాన్ని సైతం పెంటగాన్ నివేదిక ప్రస్తావించింది. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా దౌత్య, ఆర్థిక, రాజకీయ, సైనిక ఒత్తిడిని తీవ్రతరం చేసినట్లు నివేదిక పేర్కొంది.
మరోవైపు ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అమెరికాకు చెందిన రక్షణ శాఖ నిపుణులు తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో చైనా విమానాల ఉనికి గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. ఇది సురక్షితం కాదని.. ఈ చర్య ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.