Super long Covid: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిని కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియచెప్పేలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి వరుసగా 505 రోజులపాటు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. 2020 ఆరంభంలో వైరస్ బారినపడిన ఆ రోగికి.. రెమిడెసివిర్ సహా మరెన్నో ఔషధాలతో చికిత్స అందించినా 2021లో చనిపోయినట్లు వెల్లడైంది.
ఇతర వ్యాధుల కారణంగా ఆ వ్యక్తి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ అప్పటికే తీవ్రంగా బలహీనపడిందని, అందుకే ఏడాదిన్నరకుపైగా కరోనా అలానే ఉందని లండన్ కేంద్రంగా పనిచేసే గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో అంటువ్యాధుల నిపుణుడైన డాక్టర్ లూక్ బ్లాగ్డాన్ స్నెల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కరోనా పాజిటివ్ ఉన్న కేసు ఇదేనా అని కచ్చితంగా చెప్పడం కష్టమన్నారు స్నెల్. అన్ని కేసుల్లోనూ ఇలా క్రమబద్ధంగా టెస్టులు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు.
ఇదే తరహాలో సుదీర్ఘకాలంపాటు కరోనా పాజిటివ్ ఉన్న 9 కేసులపై స్నెల్ బృందం అధ్యయనం చేసింది. అవయవ మార్పిడి, హెచ్ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర రోగాలకు చికిత్స తీసుకుంటూ ఉండడం వల్ల ఆ 9 మంది రోగనిరోధక వ్యవస్థలు తీవ్రంగా బలహీనపడ్డాయి. ఇలా సూపర్లాంగ్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారి శరీరంలోనే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయా అనే కోణంలో పరిశోధన జరిపింది. ఈ వివరాలను ఈ వారాంతంలో పోర్చుగల్‌లో జరిగే ఓ సదస్సులో ప్రెజెంటేషన్ రూపంలో వెల్లడించనుంది స్నెల్ బృందం. వీరి అధ్యయనంలో తేలిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి..
- వీరికి సగటున 73 రోజులు వరుసగా కరోనా పాజిటివ్ వచ్చింది.
- ఇద్దరు రోగులు ఏడాదికన్నా ఎక్కువ కాలం కరోనాతో పోరాడారు.
- ఇలాంటి రోగుల నుంచి ఇతరులకు కరోనా వ్యాపిస్తుందనేందుకు ఆధారాలు లభించలేదు.
- 9 మందిలో ఐదుగురు బతికారు. వీరిలో ఇద్దరు చికిత్స లేకుండానే వైరస్‌ను జయించారు. ఇద్దరు చికిత్స తర్వాత కోలుకున్నారు.
- మరో వ్యక్తి ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్నారు. ఆ రోగి శరీరంలో 412 రోజులకుపైగా(నివేదిక రూపొందించే నాటికి) వైరస్ సజీవంగా ఉంది.
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు కరోనా బారినపడకుండా చూసుకోవడం సహా అలాంటి వారికోసం ప్రత్యేక చికిత్స విధానాలు తయారు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన తెలియచెబుతోందని స్నెల్ అన్నారు. జనసమూహంలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. మరోవైపు.. స్నెల్ బృందం అధ్యయనానికి ముందు.. సూపర్లాంగ్ కొవిడ్ ఇన్ఫెక్షన్ రికార్డ్ 335 రోజులుగా ఉంది. క్రమబద్ధంగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేసి ఈ విషయం చెబుతున్నట్లు అప్పట్లో పరిశోధకులు ప్రకటించారు.