Sudan Air Strike : సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో శనివారం జరిగిన వైమానికి దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా 17 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వైమానికి దాడిలో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అయితే ఈ దాడి విమానం ద్వారా చేశారా లేక డ్రోన్‌తో చేశారని అనే దానికి స్పష్టత రాలేదు. ఈ మేరకు సూడాన్ ఆరోగ్య శాఖ ఫేస్బుక్లో వెల్లడించిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఈ వైమానిక దాడిని 'ఊచకోత'గా ఆరోగ్య శాఖ అభివర్ణించిందని పేర్కొంది. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారని, కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని ది ఎమర్జెన్సీ రూమ్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ చెప్పినట్లు తెలిపింది.
Sudan Crisis : సూడాన్‌లో సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)కు మధ్య ఏప్రిల్ నుంచి అంతర్యుద్ధం మొదలైంది. అందులో భాగంగా ప్రస్తుతం ఖార్టూమ్ దక్షిణ ప్రాంతమైన యార్మౌక్లో ఘర్షణలు జరుగుతున్నాయి.
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
Pakistan Bus Accident : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 3 చిన్నారులు, ఐదుగురు మహిళలతో సహా 13 మంది మృతిచెందారు. 25 మంది గాయపడ్డారు. ఈ మేరకు శనివారం అధికారులు వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ బస్సు 34 మంది ప్రయాణికులతో లాహార్ నుంచి రావల్పిండి వెళ్తోంది. కల్లార్ కహర్ సాల్ట్ రేంజ్ వద్ద బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల హైవేపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించినవారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో కొంత మంతి పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని జాతీయ హైవేలు, మోటార్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సహాయక చర్యల కోసం.. ఆరు వరుసల రహదారిలోని రెండు వరుసలు మూసివేశామని చెప్పారు. అధ్వానమైన రోడ్లు, భద్రతా అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయి.