సాంకేతికత ఏ స్థాయిలో వృద్ధి చెందుతోందో సైబర్ మోసాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తుల డేటాను హ్యాకర్లు చోరీ చేసి బాట్ మార్కెట్లో విక్రయించినట్లు వెల్లడైంది. అందులో అత్యధికంగా భారత్ నుంచే 6 లక్షల మంది వివరాలు ఉన్నాయని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ తన అధ్యయనంలో పేర్కొంది. గత నాలుగేళ్లుగా బాట్ మార్కెట్‌లో విక్రయానికి ఉంచిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
బాట్ మాల్‌వేర్ సాయంతో వ్యక్తుల డివైజ్‌ల నుంచి సేకరించిన డేటాను హ్యాకర్లు బాట్ మార్కెట్‌లో విక్రయిస్తుంటారని నార్డ్ వీపీఎన్ తెలిపింది. ఇందులో యూజర్ లాగిన్ వివరాలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్‌షాట్స్, ఇతర వివరాలు ఉంటాయని పేర్కొంది. ఒక్కో వ్యక్తి డిజిటల్ గుర్తింపును విక్రయించినందుకు గానూ సగటున రూ.490 చెల్లిస్తుంటారని తెలిపింది. 2018 నుంచి ఈ బాట్ మార్కెట్ అందుబాటులోకి రాగా.. జెనిసిస్ మార్కెట్, ది రష్యన్ మార్కెట్, 2ఈజీ అనే మూడు ప్రధాన మార్కెట్లను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు సైతం ఇందులో ఉన్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా డార్క్ వెబ్‌కీ, బాట్ మార్కెట్‌కూ మధ్య తేడాను సైతం నార్డ్ వివరించింది. బాట్ మార్కెట్ కావాలనుకుంటే.. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన డేటాను అధిక మొత్తంలో పొందగలదని తెలిపింది. అంతేకాదు.. బాట్ మాల్వేర్ ద్వారా ఇన్‌ఫెక్ట్ అయినంత కాలం సంబంధిత డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామన్న హామీ కొనుగోలుదారులకు ఉంటుందని నార్డ్ వీపీఎన్ పేర్కొంది. ఇప్పటి వరకు విక్రయించిన డేటాలో 81 వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్‌లు, 5.38 లక్షల ఆటో ఫిల్‌ఫార్మ్స్‌తోపాటు అనేక డివైజ్‌ల స్క్రీన్‌షాట్‌లు, వెబ్‌కామ్ స్నాప్స్ ఉన్నాయని నార్డ్ వీపీఎన్ తెలిపింది.