Sri Lankan Fuel Crisis: లంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. జులై 13న రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు విపక్షాలు అంగీకరించాయి.
మరోవైపు లంక జనం అష్టకష్టాలతో అల్లాడుతున్నారు. ఆకలి రోదనలు మిన్నంటాయి. ఇంధన కొరతకు తోడు ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు నిత్యావసర ధరలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు నిండుకున్నాయి. ధరలు కూడా పెట్రోల్ లీటర్‌కు లంక రూపాయల్లో 470కిపైనే. డీజిల్‌ను రూ.460కి విక్రయిస్తున్నారు. దీంతో లంక జనం వారి కార్లు, బైక్‌లను వదిలిపెట్టి.. సైకిళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆఫీస్, కాలేజ్‌కు వెళ్లేందుకు సహా రోజువారీ పనుల కోసం వీటినే వినియోగిస్తున్నారు. దీంతో.. ఒక్కసారిగా సైకిళ్లకు డిమాండ్ పెరిగింది. సైకిల్ స్టోర్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి.
మ్యూజియంలా అధ్యక్ష నివాసం: రెండ్రోజుల క్రితం వరకు రణరంగాన్ని తలపించిన శ్రీలంక అధ్యక్ష భవనం పరిసరాలు ఇప్పుడు జనసందోహంతో కళకళలాడుతున్నాయి. శ్రీలంక అధ్యక్ష నివాసం పర్యటక కేంద్రంగా మారింది. అధ్యక్ష నివాసాన్ని చూసేందుకు లంక ప్రజలు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయట్లేదు. గొడుగులు పట్టుకొని మరీ రోడ్డు పొడవునా బారులు తీరారు.
ఈ నెల 9న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో లక్షలాది మంది ఆందోళనకారులు కొలంబోలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గొటబాయ ముందురోజే అధికార నివాసం వదిలి పారిపోయారు.
దీంతో లక్షలాదిగా వెళ్లిన ఆందోళనకారులు గేట్లు బద్దలుకొట్టి అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. ప్రతి గదిలో కలియతిరిగారు. విలాసవంతమైన భవనంతోపాటు అధ్యక్షుడు పొందుతున్న సకల సదుపాయాలు చూసి లంక ప్రజలు ఆశ్చర్యపోయారు. ఖరీదైన సోఫాలు, మంచాలు, ఫర్నీచర్ తదితరాలు చూసి స్వర్గమంటే ఇదేరా అనుకుని సంబరపడిపోతున్నారు.
రాజపక్సను అడ్డుకున్న అధికారులు: మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు, మాజీ ఆర్థికమంత్రి బాసిల్ రాజపక్స.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సోమవారం సాయంత్రం కొలంబో విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా ఆయనను గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు బసిల్ రాజపక్సను విమానంలో ప్రయాణించేందుకు నిరాకరించారు. క్లియరెన్స్ ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు.
లంకకు భారత్ సాయం: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న లంకకు సాయం చేయడంలో భారత్ ఎప్పటినుంచో ముందే ఉంటోంది. ఇప్పుడు ఆ దేశ విమానయాన కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా.. భారత్‌లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలు తోడ్పడుతున్నాయి. అక్కడ లంక విమానాలను ఇంధనాన్ని నింపుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
ఇవీ చూడండి: పురుషుడికి రుతుస్రావం.. కంగుతిన్న డాక్టర్లు.. చివరికి ఏమైందంటే..
వచ్చేవారం శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక.. బరిలో విపక్ష నేత ప్రేమదాస