Srilanka Emergency: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగుదేశం శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మరోసారి అత్యయిక పరిస్థితి విధించారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ ద్వీప దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇదో రెండోసారి. ఐదు వారాల క్రితం నిరసనకారులు అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చేలరేగింది. పలువురు పోలీసులతో పాటు నిరసనకారులు పెద్దఎత్తున గాయపడ్డారు. దీంతో ఆ సమయంలో అధ్యక్షుడు గొటబాయ కొన్నిరోజుల పాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.
శ్రీలంకలో ఈ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. దీనికి తోడు మరోవైపు శుక్రవారం వందల సంఖ్యలో నిరసనకారులు, విద్యార్థులు ఆ దేశ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులతో అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ మరోసారి భద్రతా బలగాలకు అధికారం కల్పించారు. మరోవైపు శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది.
ఇదీ చదవండి: విమానంలో ప్రయాణికుడి హల్చల్.. డోర్ ఓపెన్ చేసి రెక్కలపైకి వెళ్లి..