Sri Lanka protests today: ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ శ్రీలంకలో కొంతకాలంగా జరుగుతున్న నిరసనల్లో తొలిసారి హింస చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా.. ఒకరు మరణించారు. 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కెగల్లె ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
రాజధాని కొలంబో నగరానికి 95 కిలోమీటర్ల దూరంలోని రాంబుక్కనలో ఈ ఘటన జరిగింది. ఇంధన కొరత, అధిక ధరలను నిరసిస్తూ అనేక మంది రెైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు రాళ్ల దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మొదట టియర్ గ్యాస్ వాడామని.. అనంతరం కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు.
శ్రీలంకలో ఇంధన ధరలూ భగ్గుమంటున్నాయి. ఈ ద్వీప దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం శ్రీలంక రూ.338కు చేరింది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ) పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) కూడా సోమవారం అర్ధరాత్రి ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను రూ.84 మేర పెంచేయడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.338కి చేరింది. శ్రీలంకలో గత ఆరు నెలల కాలంలో ఎల్‌ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా.. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు తాజాగా పెంచిన ధరలు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి.
మరోవైపు, శ్రీలంకలో గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. పలు చోట్ల రహదారులను బ్లాక్ చేసి వాహనాలు, టైర్లకు నిప్పంటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.338- భగ్గుమంటున్న ప్రజలు