Sri Lanka economic crisis: ద్వీప దేశం శ్రీలంకలో ఆర్థిక, ఆహారంతో పాటు ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ-ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు పిలుపునిచ్చింది. లేనిపక్షంలో కూటమి నుంచి వైదొలుగుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్లమెంటులో అన్ని పార్టీలకు చెందిన ప్రభుత్వం నెలకొల్పాలని తమ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయించినట్లు ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ ప్రధాన కార్యదర్శి దయసిరి జయశేఖర వెల్లడించారు. అధికారంలో ఉన్న శ్రీలంక పొదుజన పెరమున-ఎస్ఎల్పీపీ .. 11 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఈ కూటమిలో 14 మంది సభ్యులతో సిరిసేనకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పటికే ఇద్దరు క్యాబినెట్ మంత్రులను తొలగించగా, ప్రస్తుత సంక్షోభాన్ని వ్యతిరేకిస్తూ మరో సభ్యుడు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ హెచ్చరికలతో గొటబయ ప్రభుత్వానికి గండం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అత్యవసర పరిస్థితి: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. పెరిగిన ధరలు, ఆహార పదార్థాలు, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి విధించారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎవరినైనా నిర్బంధించడం, ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, దేశంలో ఎక్కడైనా సోదాలు జరిపే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఏదైనా చట్టాన్ని మార్చే అధికారం కూడా లభిస్తుంది. అయితే ఈ ఆంక్షలకు ప్రతీ 30 రోజులకు ఒకసారి పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
6వేల మెట్రిక్ టన్నుల చమురు సాయం: 2 కోట్ల 20 లక్షల జనాభా కలిగిన శ్రీలంకలో మార్చి నెలలో ద్రవ్యోల్బణం 18.7 శాతంగా ఉన్నట్లు తాజాగా విడుదలైన గణాంకాలు చెబుతున్నాయి. ఆహార పదార్థాల ధరలు రికార్డు స్థాయిలో 30.1 శాతం పెరిగినట్లు వెల్లడించాయి. అటు భారత్ నుంచి 6వేల మెట్రిక్ టన్నుల ఇంధనంతో ఓ నౌక శ్రీలంక చేరుకుంది. సంక్షోభం కారణంగా భారత్ నుంచి పొందిన బిలియన్ డాలర్ల రుణంలో భాగంగా దిల్లీ నుంచి డీజిల్‌ను తరలించారు. ఈ డీజిల్‌ను శ్రీలంక వ్యాప్తంగా సరఫరా చేయనున్నారు.
ఇదీ చూడండి: