South Africa Fire Accident : దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 73 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఓ ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గురువారం వేకువజామున ఒంటి గంటన్నరకు జరిగిందీ దుర్ఘటన. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది.
భారీ ఎత్తున చెలరేగిన మంటలు..
Johannesburg Fire Accident : భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం వల్ల.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాగా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. నిరాశ్రయులు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండానే ఈ భవనంలో నివాసముంటున్నారని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు.
'ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు'
South Africa On Fire : ఇప్పటివరకు 73 మృతదేహాలను వెలికితీశామని.. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 200 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమ కుటుంబీకులు, బంధువులు మరణించడం వల్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.