Silvio Berlusconi Marta Fascina : ఇటలీ దివంగత ప్రధాని సిల్వియో బెర్లుస్కోని.. ఆసక్తికరమైన వీలునామా రాశారు. తన ఆస్తిలో రూ.900 కోట్లు గర్ల్‌ఫ్రెండ్‌కు చెందేలా వీలునామా రాశారు. గత నెల జూన్‌లో బెర్లుస్కోని కన్నుమూశారు. ఈ నేపథ్యంలో జీవించి ఉన్నప్పుడు బెర్లుస్కోని రాసిన వీలునామాను.. ఆయన ఐదుగురు సంతానం, ఇతర ప్రత్యక్ష సాక్షుల ముందు చదివి వినిపించారు. బెర్లుస్కోని మొత్తం ఆస్తి ఆరు బిలియన్ యూరోలు (రూ.54వేల కోట్లు) కాగా.. అందులో 100 మిలియన్ యూరోలను (రూ.900 కోట్లు) తన గర్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినా (33)కు చెందేలా పేర్కొన్నారు. మార్టాతో ఆయనకు వివాహం కానప్పటికీ.. ఆమెను తన వీలునామాలో 'భార్య'గానే సంబోధించారు.
Silvio Berlusconi will : 2020 మార్చిలో ఫాసినా, బెర్లుస్కోని మధ్య సంబంధాలు చిగురించాయి. 33 ఏళ్ల ఫాసినా ఇటలీ పార్లమెంట్‌లోని దిగువ సభ సభ్యురాలు. 2018 నుంచి ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెర్లుస్కోని పార్టీలోనూ ఆమె సభ్యులుగా ఉన్నారు. 1994లో బెర్లుస్కోని రాజకీయాల్లోకి వచ్చారు. ఫోర్జా ఇటాలియా అనే లిబరల్ కన్సర్వేటివ్ పార్టీని స్థాపించారు. స్వతహాగా ఆయనో వ్యాపారవేత్త, మీడియా దిగ్గజం. ప్రజా ప్రతినిధిగానూ ఆయన విశేషంగా సేవలు అందించారు. ఇకపై బెర్లుస్కోని వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన సంతానంలోని మరీనా, పీర్ సిల్విలోలు చూసుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కార్యనిర్వాహక పదవుల్లో ఉన్నారు. వీరిద్దరికీ వ్యాపారంలో 53 శాతం వాటాలు దక్కనున్నాయి.
Silvio Berlusconi party : ఇక తన వీలునామాలో మరికొందరికి భారీగా ఆస్తి రాసిచ్చారు. తన సోదరుడు పావ్లోకు 100 మిలియన్లు (రూ.900 కోట్లు) ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మాఫియాతో సంబంధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ఉత్రికి 30 మిలియన్ యూరోలు (రూ.270 కోట్లు) ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటలీని అత్యంత సుదీర్ఘ కాలం పాలించిన ప్రధానిగా బెర్లుస్కోని రికార్డుకెక్కారు. అయితే, ఆయనపై అనేక వివాదాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కేసులో బెర్లుస్కోని దోషిగా తేలారు. దీంతో ఆరేళ్ల పాటు రాజకీయాల నుంచి నిషేధం ఎదుర్కొన్నారు. అనేక ఇతర కుంభకోణాల్లోనూ ఆయన పేరు వినిపించింది. ఓసారి తనను తాను ఏసు క్రీస్తుగా అభివర్ణించుకున్నారు బెర్లుస్కోని. తన జీవితచరమాంకం వరకు రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. సెనేటర్‌గా, ఇటలీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగారు. 2020 సెప్టెంబర్‌లో కొవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. 2023 ఏప్రిల్‌లో ల్యూకేమియాతో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు సైతం ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.