Shooting In Mexico Today : మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్రిస్మస్ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని వెల్లడించారు. అయితే ఆ కాల్పులకు దారితీసిన పరిస్థితులను తెలపలేదు.
గ్వానాజువాటోలో జాలిస్కో ముఠా, సినాలోవా ముఠా మద్దతు ఉన్న స్థానిక గ్యాంగ్‌ల మధ్య వైరం ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. దేశంలో అత్యదిక హత్యలు జరిగిన రాష్ట్రం ఇదే.
ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం- ఐదుగురు పిల్లలు మృతి
Fire Accident In Arizona USA : అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. బుల్సిటీ నగరంలో కొలరడో నది సమీపంలోని కాలనీలో ఉన్న రెండంతస్తుల డుప్లెక్స్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు 11, 13 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు మృతిచెందారు. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో పెద్దవారెవరూ లేరని తెలుస్తోంది. బాధితుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలను అగ్మిమాపక విభాగం ప్రతినిధులు వెల్లడించలేదు. ఈ కేసును నగర పోలీసులు, అగ్నిమాపక విభాగంతో పాటు ఇతర ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
చర్చిలో భారీ అగ్నిప్రమాదం
Fire Incident Church Los Angeles : అమెరికాలోని లాస్ఎంజెలెస్ ఏరియా చర్చిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ చర్చ్‌లో తలపెట్టిన క్రిస్మస్ ప్లే, బొమ్మల వితరణ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయితే దాదాపు 20 నిమిషాల తర్వాత చర్చి పైకప్పు కూలిపోయింది. దీంతో మంటలను అదుపు చేయడం కొంచెం కష్టంగా మారిందని అగ్నిమాపక శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.