China corona news: చైనా ఆర్థిక నగరం షాంఘై కరోనాతో విలవిలలాడుతోంది. రెండున్నర కోట్ల జనాభా కలిగిన మహా నగరం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ నిత్యం రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 27 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ‘డైనమిక్ కొవిడ్ వ్యూహాన్ని’ కచ్చితంగా అమలు చేస్తామని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉద్ఘాటించిన మరుసటి రోజే కేసుల సంఖ్య మరింత పెరిగాయి.
వుహాన్‌లో కరోనా వైరస్ వెలుగు చూసిన రెండేళ్ల తర్వాత చైనాలో ఆ స్థాయిలో కేవలం షాంఘైలోనే విజృంభణ కొనసాగుతోంది. దీంతో గడిచిన రెండు వారాలుగా అక్కడ కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. పాజిటివ్ సోకిన వ్యక్తులు ఇంట్లోని వారికి దూరంగా ఉండాలంటూ అధికారుల నిబంధనలపై షాంఘై వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన చైనా సీడీసీ.. నిబంధనలను సడలించే ప్రయత్నం చేస్తోంది.
కేవలం షాంఘైలోనే కాకుండా చైనా వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గవేకాల్ డ్రాగొనామిక్స్ అధ్యయనం ప్రకారం, చైనాలోని 100 అతిపెద్ద నగరాల్లో దాదాపు 87 నగరాల్లో కొవిడ్ క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొవిడ్ కట్టడికి డైనమిక్ కొవిడ్ వ్యూహానికే చైనా కట్టుబడి ఉందని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నందున ఇటువంటి ఆంక్షలు తప్పవన్న ఆయన.. లాక్‌డౌన్ ఆంక్షలను తట్టుకోవడం ద్వారా మహమ్మారిపై విజయం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన హస్తప్రయోగం.. లంగ్స్‌కు 'చిల్లు'.. చరిత్రలో తొలిసారి!