Australia Squad For Boxing Day Test : ఆస్ట్రేలియా - భారత్ మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. బాక్సింగ్ టెస్టుగా పిలిచే మ్యాచ్ కోసం ఆసీస్ తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్టుతో పోలిస్తే ఆసీస్ మేనేజ్మెంట్ జట్టులో రెండు మార్పులు చేసింది. యువ ఆటగాడు 19 ఏళ్ల సామ్ కాన్ట్సాస్‌కు జట్టులో చోటు కల్పించింది. నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో అతడికి అవకాశం ఇచ్చింది. గాయం కారణంగా సిరీస్‌కే దూరమైన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ మూడో ప్రధాన పేసర్‌గా వచ్చాడు.
ఇక డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అనే సందేహం తొలిగింది. ఫిట్‌నెస్ టెస్టులో హెడ్ పాస్ కావడం వల్ల అతడిని తుది జట్టుకు ఎంపిక చేసింది. 'ట్రావిస్ హెడ్ చాలా బాగున్నాడు. గత రెండు రోజులు ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. యంగ్ ప్లేయర్ సామ్ కాన్ట్సాస్ డెబ్యూ మ్యాచ్ ఆడనున్నాడు. 13ఏళ్ల కిందట నేను కూడా పద్దెనిమిది ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఆడాను. ఇప్పుడు అతడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా అతడికి నేనిచ్చే సలహా ఒకటే. ఇతర గేమ్‌ల మాదిరిగా ఈ టెస్టును ఆడమని చెబుతా. ఎలాంటి ఒత్తిడికి గురికావద్దు' అని కెప్టెన్ కమిన్స్ తెలిపాడు.
ఖవాజా - కాన్ట్సాస్ జోడీ అరుదైన ఫీట్
నాలుగో టెస్టులో ఖవాజా - కాన్ట్సాస్ జోడీ ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే ఈ జోడీ ఓ అరుదైన ఫీట్ సాధించనుంది. ఖవాజా వయసు 38ఏళ్లు కాగా, సామ్ ఏజ్ 19ఏళ్లే. అంటే ఇద్దరి మధ్య 19ఏళ్ల గ్యాప్. దీంతో వీరిద్దరు అత్యధిక వయసు వ్యత్యాసం కలిగిన తొలి ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించనున్నారు.
ఆస్ట్రేలియా తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్ట్సాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్
బాక్సింగ్ డే టెస్టు - బుమ్రా, స్మిత్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డులు