School Gym Roof Collapse In China : చైనా.. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉన్న ఓ పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు 160 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల్లో చాలా మంది చిన్నారులున్నారు.
లాంగ్‌షా జిల్లాలోని నెం.34 మిడిల్ స్కూల్‌లో జిమ్ పైకప్పు 1,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో జిమ్‌లో 19 మంది ఉన్నారు. అందులో నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు, 13 మంది బయటకు తీశామని చెప్పారు. అందులో ముగ్గురిని చిన్నచిన్న గాయాలతో బయటకు తీశామని.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించినట్లు వెల్లడించారు.
అయితే, పాఠశాల ప్రాంగణంలో మరో భవనం నిర్మిస్తుండగా.. నిర్మాణానికి వినియోగించిన పెర్‌లైట్ అనే ఓ పదార్థాన్ని పనుల అనంతరం జిమ్ పైకప్పు మీదే ఉంచేశారు. వర్షాలు కురుస్తుండటం వల్ల.. అది నీరు మొత్తాన్ని పీల్చుకొని బరువు పెరిగిపోయింది. ఫలితంగా పైకప్పు కూలిపోయినట్లు తెలుస్తోంది.. ఈ ఘటనలో లోతైన విచారణ కొనసాగుతోందని.. నిర్మాణ సంస్థకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
పడవ బోల్తో.. 15 మంది మృతి..
ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో ఓ పడవ మునిగిపోయింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మరో 19 మంది గల్లంతయ్యారని చెప్పారు. అయితే, ఆ పడవలో ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయంపై వెంటనే స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.
వర్షాల బీభత్సం.. 31 మంది మృతి..
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలతో ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా అఫ్గాన్‌లో 31 మంది మరణించగా.. 41 మంది మంది గల్లంతయ్యారు. మరో 74 మంది గాయపడ్డారు. పాక్‌లో 13 మంది మరణించగా ఏడుగురు గాయపడ్డారు.
- ఆకస్మిక వరదలు అఫ్గాన్ రాజధాని కాబుల్‌ను చుట్టుముట్టాయి. మైదాన్ వర్దక్, గజనీ ప్రావిన్సుల్లో పోటెత్తాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కాబుల్, పశ్చిమ వర్దక్‌కు చెందిన వారని తాలిబన్ అధికార ప్రతినిధి సఫీయుల్లా రహీమి ఆదివారం వెల్లడించారు. 3 రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయని ఆయన తెలిపారు. 250 పశువులూ వరదల్లో కొట్టుకుపోయాయని వివరించారు.
- పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రావిన్సులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖైబర్‌లోని చిత్రాల్ జిల్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొండ ప్రాంతాల్లో భారీగా వరదలు వస్తున్నాయి. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ పాక్‌లో 101 మందిమరణించారు.
- చైనా, కెనడాలనూ వరదలు ముంచెత్తుతున్నాయి. తూర్పు చైనాలో వరదల కారణంగా ఐదుగురు చనిపోగా, కెనడాలోని అట్లాంటిక్ తీరంలో కుండపోత వర్షాలతో ఒక్కసారి వరద రావడంతో నలుగురు గల్లంతయ్యారు.
- హాంగ్‌జౌలోని ఫయాంగ్ ప్రాంతంలో భారీ వరదలొచ్చాయి. పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండ చరియలు విరిగిపడి బురద మట్టి పేరుకుపోయింది. దీంతో 1500 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐదుగురు మృతి చెందారు. ఏటా ఈ ప్రాంతంలో సీజనల్ వరదలు వస్తుంటాయి. ఈ ఏడాది చైనాలోని కొన్ని ప్రాంతాల్లో గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయి.
- కెనడాలోనూ భారీ వర్షాలు కురిసి ఆకస్మాత్తుగా వరదలు రావడంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. రెండు రోజులుగా అట్లాంటిక్ తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. విద్యుత్తు సరఫరాకూ అంతరాయం కలిగింది. హాలీఫాక్స్ ప్రాంతంలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లో 30 సెం.మీ.వర్షపాతం నమోదైంది.
- ఇవీ చదవండి :
- ముంచెత్తిన వరదలు.. 200 మందికి పైగా మృతి.. భారీగా ఆస్తి నష్టం
- సొరంగంలోకి మెరుపు వరద.. 13 మంది మృతి.. బస్సు, కార్లలోని మిగిలిన వారంతా..