Russia Wagner Group : రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌పై.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా సైన్యంపై ప్రిగోజిన్ తిరుగుబాటు నిర్ణయాన్ని ద్రోహంగా అభివర్ణించారు. ప్రిగోజిన్ ప్రకటన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడిన పుతిన్.. వాగ్నర్ సాయుధ తిరుగుబాటుదారులు రోస్టోవ్-ఆన్-డాన్ నగరంలో పౌర, సైనిక పాలక సంస్థలను నిరోధించారని చెప్పారు. తీవ్రమైన నేరపూరిత సాహసానికి ప్రిగోజిన్ ఒడిగట్టారని.. పుతిన్ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పుతిన్ వ్యాఖ్యలను ఖండించిన.. ప్రిగోజిన్..
Wagner Group Prigozhin : రష్యా అధ్యక్షుడు పుతిన్ తనపై చేసిన వ్యాఖ్యలను వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ ఖండించారు. దేశానికి ద్రోహం చేశానన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. తన తరఫున పోరాటం చేస్తున్న వారిని దేశ భక్తులుగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రిగోజిన్ తన టెలిగ్రామ్ ఛానల్‌లో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పుతిన్ అభ్యర్థించినంత మాత్రాన తన సైనికులు వెనక్కు తగ్గరని వెల్లడించారు. దేశం అవినీతిలో కూరుకుపోతుంటే తాను చూస్తూ ఊరుకోబోనని ప్రిగోజిన్ స్పష్టం చేశారు.
'మేం లొంగిపోం.. త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు'
Wagner Group vs Russian Army : దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రిగోజిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ ద్రోహం చేయలేదని తెలిపారు. పుతిన్ పొరబడ్డారని, తాము దేశభక్తులమని.. ఏ ఒక్కరూ కూడా లొంగిపోవడం లేదని వివరించారు. దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు.
రష్యాకు వెన్నుపోటు పొడిచాయి: జెలెన్‌స్కీ
Russia Ukraine Zelensky : పాలు పోసి పెంచిన రష్యాపైనే కిరాయి సైనికుల ముఠా వాగ్నర్ గ్రూప్ యుద్ధాన్ని ప్రకటించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. చెడు మార్గాన్ని ఎంచుకున్న ఎవరైనా.. తమను తామే నాశనం చేసుకుంటారని అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. పక్క దేశంలోని మనుషుల్ని చంపేందుకు దళాలను పంపితే అవే రష్యాకు వెన్నుపోటు పొడిచాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. వేలాదిమందికి ఆయుధాలిచ్చి యుద్ధంలోకి దించిన రష్యా.. ఇప్పుడు వారి నుంచే ఆత్మరక్షణ చేసుకోవాల్సి వచ్చిందని జెలన్‌స్కీ అన్నారు. ఎప్పటి నుంచో తన మూర్ఖత్వాన్ని కప్పి పుచ్చుకునేందుకు రష్యా అవాస్తవ ప్రచారంతో ముందుకు సాగుతోందనీ ఆరోపించారు. ఈ తిరుగుబాటుతో రష్యాలో అస్థిరత ఉందని రుజువైందని తెలిపారు. ఉక్రెయిన్ ఎప్పటికీ ఐక్యంగా ఉంటుందనీ బలాన్ని పెంచుకుంటుందనీ జెలన్‌స్కీ పేర్కొన్నారు.