Russia Ukraine War : ఉక్రెయిన్‌పై మరోమారు రష్యా భీకర దాడులకు పాల్పడింది. జపోరిజియా నగరంపై శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారు 17 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అనేక మంది గాయలపాలైనట్లు వెల్లడించారు. 5 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని.. మరో 40 నివాసాల వరకు ధ్వంసమైనట్లు నగర కౌన్సిల్ సెక్రటరీ తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం సైతం ఈ దాడులను ధ్రువీకరించింది. గత కొన్ని రోజులుగా జపోరిజియా నగరంపై తరచూ దాడులకు పాల్పడుతోంది రష్యా.
రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనపై శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. ఈ పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వంతెనపైకి వెళ్లే వాహనాలన్నింటినీ అత్యాధునిక పరికరాలతో క్షణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నప్పటికీ పేలుడు ఎలా జరిగిందనే విమర్శలు ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. పేలుడుకు కారణమైన ట్రక్ యజమాని దక్షిణ రష్యాలోని క్రాస్నాడర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శనివారం రైలు, వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు.. ఆదివారం పునరుద్ధరించారు.
మరోవైపు వరుస ఎదురు దెబ్బలు తింటోన్న రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. 'ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తమ దేశ సైనిక దళాలన్నిటికీ వైమానిక దళ అధిపతి జనరల్ సెర్గెయ్ సురోవికిన్ కమాండర్‌గా ఉంటారు' అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా సైనిక బలగాలన్నిటినీ ఒకే కమాండర్ పరిధిలోకి తీసుకురావడం ఇదే తొలిసారి.
ఇవీ చదవండి:రష్యా-క్రిమియా రైలు వంతెనపై భారీ పేలుడు.. ఎగసిపడిన మంటలు.. ముగ్గురు మృతి
'విలీన ప్రాంతం'పైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్లు.. ముగ్గురు మృతి.. 12మందికి తీవ్రగాయాలు!