Russia Ukraine war: ఉక్రెయిన్‌లోని రైల్వే స్టేషన్‌పై రష్యా రాకెట్ దాడి చేయగా.. 30 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు ఉక్రెయిన్ డొనెస్క్ ప్రాంతంలోని క్రమాటోర్స్క్‌లోని రైల్వే స్టేషన్‌పై శుక్రవారం రష్యా ఈ దాడికి ఒడిగట్టిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. యుద్ధభూమి నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లేవారి ప్రయాణ అవసరాల కోసం ఉపయోగిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో దాడి జరిగినప్పుడు వేల మందికిపైగా ప్రజలు ఉన్నారని వివరించారు. రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్‌పై ప్రధానంగా దృష్టి సారించిన కారణంగా ఇక్కడి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారని, ఈ క్రమంలోనే రష్యా వీరిపై రాకెట్ దాడులతో విరుచుకుపడిందని చెప్పారు.
పుతిన్ కుమార్తెలపై ఈయూ ఆంక్షలు: ఉక్రెయిన్‌లో మారణహోమానికి కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐరోపా సమాఖ్య మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. ఆయన ఇద్దరు కుమార్తెలు వొరొంట్సోవా, క్యాటెరీనా టికోనోవా లక్ష్యంగా కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. వీరిద్దరి ఆస్తులను ఫ్రీజ్ చేయడం సహా ప్రయాణాల నిషేధం విధిస్తున్నట్లు ఈయీ అధికారులు తెలిపారు. ఇప్పటికే అమెరికా కూడా పుతిన్ కుమార్తెలపై ఇదే తరహా ఆంక్షలను రెండు రోజుల క్రితమే అమల్లోకి తెచ్చింది.